నిమజ్జనం సందర్బంగా శుక్రవారం మూడు జిల్లాలకు సెలవు 

వినాయక నిమజ్జనం సందర్బంగా శుక్రవారం  హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది.
 
 శుక్రవారానికి బదులుగా ఈ నెల 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్ లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు  శుక్రవారం, శనివారం జరగనున్న గణేష్ శోభాయాత్రకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 
 
ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు గురువారం ఉదయం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏర్పాట్ల కోసమే తాము ఆందోళన చేశామని సమితి ప్రధాన కార్యదర్శి డా. భగవంతరావు తెలిపారు. ఆలస్యమైనా భారీగా ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. తమ ఆందోళనను  ఏ ఒక్క రాజకీయ పార్టీకి దీనిని ఆపాదించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. 
 
అన్ని పార్టీలతో ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారని ఆయన తెలిపారు. ఇది మతానికి సంబంధించి కూడా కాదని అంటూ కేవలం ఘనంగా ఉత్సవాలు జరగడమే కావాలని ఆయన చెప్పారు. అన్ని మతాల వాళ్ళు ఉత్సవాల్లో పాల్గొంటారని భగవంత రావు వెల్లడించారు. 
 
 శోభాయాత్రగా తరలివచ్చే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్ సాగర్ చుట్టూ సుమారు 20 క్రేన్లను ఏర్పాటు చేశారు. కాగా నిమజ్జనానికి ఎలాంటి ఆంక్షలు లేవని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఇప్పటికే  గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.టాంక్‌బండ్‌పై  వాహనాల రాకపోకలను నిషేధించారు. 
 
నిమజ్జనాల కోసం గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఉండేందుకు గజ ఈతగాళ్లు, ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశారు. గణేష్ విగ్రహాల వ్యర్థాలను తొలగించేందుకు వాటర్ క్లీనింగ్ మెషీన్లను అందుబాటులో ఉంచారు.
ఇక వినాయక విగ్రహాల ఊరేగింపు జరిగే ప్రాంతాలు, నిమజ్జనం జరిగే ట్యాంక్ చుట్టుపక్కల రోడ్లను మూసివేస్తున్నారు. సెప్టెంబర్ 9,10 రోజుల్లో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో రహదారులు మూతపడనున్నాయి.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగే గణేష్ నిమజ్జనాల కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. శుక్రవారం సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ పై జరగనున్న గణేశ మహా నిమజ్జనం వేడుకలను అందరూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు