తెలంగాణాలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యల పట్ల ఆందోళన 

తెలంగాణాలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యల పట్ల ఆందోళన 
తెలంగాణాలో రోజురోజుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యల పట్ల వివిధ జిల్లాల నుండి వచ్చిన రైతు ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో  వ్యవసాయం ప్రగతి పథంలో ఉందన్న కేసీఆర్ ప్రకటనలు తప్ప వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయని రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ధ్వజమెత్తారు. 
 
 సమన్వయకర్త జైపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని  26 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులను అహ్వానించిన కేసీఆర్ కు ఇక్కడ ఉన్న రైతు సంఘాల నాయకులు కనపడలేదని అసహనం వ్యక్తం చేశారు.  రాష్ట్రం లో 65 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయని, వారికి కనీస గిట్టు బాటు ధర కల్పించడం లేదని ఆరోపించారు. 
 
లక్ష రూపాయల రుణమాఫీ గాలికి వదిలేశారన్న ఆయన కేంద్రం తెచ్చిన ఫసల్ భీమా యోజన పథకం తెలంగాణలో అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం లో రైతు ప్రయోజనాలు వదిలి ఇతర రాష్ట్రం లో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. భూసార పరీక్షలు గాలికి వదిలేశారని, పంటలకు భీమా నష్ట పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. 
 
 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీని ఇప్పటివరకు నెరవేర్చ లేదని భారతీయ కిసాన్ సంఘ్ నేత రాజిరెడ్డి ధ్వజమెత్తారు.  వ్యవసాయానికి 18 నుంచి 20 గంటలు విద్యుత్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. పంట భీమా విషయంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదన్న ఆయన  వానా కాలంలో పంట నష్టం వాటిల్లిన రైతులకు ఎకరానికి రూ. 25 వేలు చొప్పున నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. 
 
అటవీ ప్రాంతంలో జంతువుల వల్ల నష్టపోయిన పంటకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని ఆయన  కోరారు. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బు జమ చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు రసీదు రైతులకు ఇవ్వాలని చెబుతూ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలతో రైతులు సతమతమవుతున్నారని తెలిపారు. 
 
ధరణి వెబ్ సైట్ తో రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా రాజిరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో 11 చక్కర ఫ్యాక్టరీలుంటే అందులో ఐదు మాత్రమే రన్ చేస్తున్నారని, మిగతావి మూసేశారని ఆరోపించారు. మిగిలిన 6 ఫ్యాక్టరీలను కూడా తిరిగి ప్రారంభించాలని, దానికి ప్రభుత్వం కృషి చేయాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
 
60 ఏండ్ల కింద వ్యవసాయానికి ఇంత ఖర్చు ఉందేది కాదని పర్యావరణ నేత హరిబాబు చెప్పారు. సరైన మార్కెట్ వ్యవస్థ లేక రైతులు నష్టపోతున్నారన్న ఆయన ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. 
 
గోవులు గోశాలలో కాదు రైతుల దొడ్లల్లో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. రైతులు తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయాలని కోరారు. స్వాతంత్ర్యం ఏర్పడి 75 ఏళ్లు గడిచినా ఆయిల్ ను మాత్రం ఇప్పటికీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు.