డ్రగ్స్‌ కేసులో ఈజిప్టు టీవీ యాంకర్‌కు మరణశిక్ష

డ్రగ్స్‌ కేసులో ఈజిప్టు టీవీ యాంకర్‌కు మరణశిక్ష
డ్రగ్స్ కేసులో 39 ఏళ్ల ఈజిప్ట్ టీవీ ప్రెజెంటర్ సారా ఖలీఫాకు మరణశిక్ష పడింది. ఆమెతో పాటు మరో 11 మంది నిందితులకు కూడా మరణశిక్ష విధిస్తూ ఈజిప్టు కోర్టు తీర్పు ఇచ్చింది.  భారీ స్థాయిలో మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణా చేస్తున్నట్లు రుజువు కావడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఖలీఫాతో సహా 12 మంది నిందితులకు కైరో క్రిమినల్ కోర్టు ఉరిశిక్షతో పాటు 500,000 ఈజిప్షియన్ పౌండ్ల ($9,800) జరిమానా విధించినట్లు అల్-అహ్రామ్ వార్తాపత్రిక నివేదించింది.
“మాదకద్రవ్యాల అక్రమ రవాణా కోసం వాటి తయారీలో ఉపయోగించే పదార్థాలను దిగుమతి చేసుకోవడంలో” నైపుణ్యం కలిగిన ఒక వ్యవస్థీకృత నేర ముఠాను ఏర్పాటు చేశారని, అలాగే లైసెన్స్ లేకుండా తుపాకులను కలిగి ఉన్నారని వారిపై ఆరోపణలు ఉన్నాయని అల్-అహ్రామ్ తెలిపింది.  మరో తొమ్మిది మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, ఏడుగురిని నిర్దోషులుగా విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఖలీఫా, ఒక ప్రముఖ ప్రజెంటర్. ఆమె తన సొంత బ్యూటీ క్లినిక్‌ను నడుపుతూ, సంగీతకారుడు హమో బికాతో కలిసి ఒక వినోద కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు.

సారా ఖలీఫా ఈజిప్టులో టెలివిజన్‌ ప్రెజెంటర్‌గా గుర్తింపు పొందారు. భద్రత, నేరాలకు సంబంధించిన అంశాలపై ప్రసారమయ్యే ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే కార్యక్రమానికి ఆమె యాంకర్‌గా వ్యవహరించారు.  సారా ఖలీఫా, ఇతర నిందితులు ముఠాగా ఏర్పడి విదేశాల నుంచి మాదకద్రవ్యాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకున్నారని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. వాటితో సింథటిక్‌ డ్రగ్స్‌ తయారు చేసి విక్రయించేందుకు ముఠా సభ్యులు వేర్వేరు బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపింది. పోలీసు దర్యాప్తులో భాగంగా 750 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌ తయారీకి ఉపయోగించే పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

డ్రగ్స్‌ ల్యాబ్‌లుగా ఉపయోగిస్తున్నట్లు అనుమానించిన రెండు అపార్ట్‌మెంట్లను కూడా గుర్తించారు. అక్కడ అక్రమంగా కలిగి ఉన్న తుపాకులు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను సారా ఖలీఫా మొదటి నుంచి ఖండిస్తున్నారు. తనకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆమె చెబుతున్నారు. 

గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన విచారణ సందర్భంగా, ఈజిప్టు యాంటీ నార్కోటిక్స్‌ అధికారుల కార్యాలయంలో డ్రగ్స్‌తో ఉన్న ఫొటోలు తీసే వరకు తాను వాటిని ఎప్పుడూ చూడలేదని న్యాయమూర్తికి చెప్పినట్లు సమాచారం. తాను జీవితంలో సిగరెట్‌ కూడా కాల్చలేదని దర్యాప్తు అధికారులకు తెలిపినట్లు ఈజిప్టు మీడియా పేర్కొంది. కోర్టులో సారా ఖలీఫా కన్నీటిపర్యంతమై తనను క్షమించాలని వేడుకున్నారు. కాగా, కోర్టు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఆమె తరఫు న్యాయవాది తీర్పును సవాల్‌ చేస్తూ అప్పీల్‌ చేయనున్నట్లు తెలిపారు.