విస్తృత ఆర్థిక వృద్ధి, ఇంధన సరఫరా సంక్షోభాలను తట్టుకునే సామర్థ్యం కారణంగా, మూడీస్ రేటింగ్స్ బుధవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. మధ్యకాలికంగా భారత ఆర్థిక వృద్ధి 7 శాతానికి సమీపంలోనే కొనసాగుతుందని, నిరంతర ప్రైవేట్ పెట్టుబడులు వృద్ధిని మరింత పెంచే అవకాశం ఉందని రేటింగ్స్ ఏజెన్సీ పేర్కొంది.
“భారతదేశ విస్తృత ఆర్థిక వృద్ధి, ఇంధన సరఫరా సంక్షోభాలను తట్టుకునే సామర్థ్యం కారణంగా, మా 2026-27 వృద్ధి అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి సవరించాము,” అని మూడీస్ తెలిపింది. అయితే, తన గ్లోబల్ మాక్రో అవుట్‌లుక్ 2027-28లో, మూడీస్ ఈ విధంగా పేర్కొంది:
“తీవ్రమవుతున్న మరియు విస్తరిస్తున్న ధరల ఒత్తిళ్ల” కారణంగా గృహ వినియోగం బలహీనంగా ఉండటంతో వృద్ధికి స్వల్పకాలిక ప్రమాదాలు కొనసాగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన 2-6 శాతం లక్ష్య శ్రేణిలోని ఎగువ స్థాయికి ప్రధాన ద్రవ్యోల్బణం చేరువలో ఉంది. అదే సమయంలో, బలహీనమైన నైరుతి రుతుపవనాలు, బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులు వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణ డిమాండ్‌పై భారం మోపుతాయి. విస్తరిస్తున్న తయారీ, సేవల పర్చేజింగ్ మేనేజర్ సూచీల మధ్య విస్తృత ఆర్థిక కార్యకలాపాలు కూడా పటిష్టంగా ఉన్నాయి”.
“ఓఈసిడిఅంచనాలకు అనుగుణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 7.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఎడిబి, ఎస్&పి గ్లోబల్ రేటింగ్స్ 7 శాతం వృద్ధిని అంచనా వేయగా, ఫిచ్ రేటింగ్స్ భారతదేశ జిడిపి 6.9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అయితే, ఆర్బీఐ వడ్డీ రేట్లను మరింత పెంచే దిశగా పయనిస్తున్నందున, కఠినమైన ద్రవ్య విధానం ప్రైవేట్ పెట్టుబడుల పునరుద్ధరణను ఆలస్యం చేయవచ్చు” అని మూడీస్ పేర్కొంది.
అధిక ఇంధన ధరలు, పెరిగిన ప్రపంచ వడ్డీ రేట్లు, నిరంతర వాణిజ్య, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటివి ద్రవ్యోల్బణం, ఫైనాన్సింగ్ ఒత్తిళ్లను పెంచుతుండటంతో, 2027లోకి అడుగుపెడుతున్న తరుణంలో వర్ధమాన మార్కెట్లు మరింత సవాలుతో కూడిన బాహ్య వాతావరణాన్ని ఎదుర్కోనున్నాయని మూడీస్ పేర్కొంది. అదే సమయంలో, ఏఐ పెట్టుబడులపై రాబడులకు సంబంధించిన ఆందోళనలు అస్థిరతకు అదనపు కారణంగా మారాయి.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ డేటాను ఉటంకిస్తూ, వర్ధమాన మార్కెట్లకు ప్రవాస పోర్ట్‌ఫోలియో ప్రవాహాలు అక్టోబర్‌లో 33.8 బిలియన్ డాలర్ల మేర బయటకు వెళ్లాయని, సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 19.3 బిలియన్ డాలర్లుగా ఉందని మూడీస్ పేర్కొంది. ఈ తగ్గుదల ప్రధానంగా ఈక్విటీలలో, ప్రత్యేకించి ఆసియాలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.

More Stories
రబీ సీజన్లో రైతులకు రూ.62,370 కోట్ల ఎరువుల సబ్సిడీ
ఢిల్లీ కాలుష్యంకు టపాసులు మాత్రమే కాదు, పంట వ్యర్థాలు కూడా
డాలర్‌తో 23 పైసలు పెరిగిన రూపాయి