రూ.1.10 లక్షల కోట్లతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలు

రూ.1.10 లక్షల కోట్లతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలు

* 98 శాతం స్వదేశ పరిశ్రమల నుంచే కొనుగోలు

త్రివిధ దళాలకు సంబంధించిన రూ.1.10 లక్షల కోట్ల ప్రతిపాదనలను రక్షణ శాఖ ఆమోదించింది. కెమికల్‌ బయోలాజికల్‌ రేడియోలాజికల్‌ అండ్‌ న్యూక్లియర్‌ (సీబీఆర్‌ఎన్‌), రీకనయిజెన్స్‌ వెహికల్స్‌, హై మొబిలిటీ వెహికల్స్‌, సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ మెకానికల్‌ మైన్‌ లేయర్స్‌, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్లు, ట్వాల్‌ ట్యాంకులు, సర్వత్రా బ్రిడ్జి సిస్టమ్‌ ఆర్మీ కోసం సేకరించనున్నారు. 

ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ నేతృత్వంలో సమావేశమైన రక్షణ పరికరాల సేకరణ మండలి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.  ఆత్మనిర్భర్ భారత్‌’ లక్ష్యానికి అనుగుణంగా త్రివిధ దళాల కోసం 98 శాతం పైగా పరికరాలను మన దేశంలోని పరిశ్రమల నుంచే సేకరించనున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఆరుద్ర రాడార్లు, వాటి నవీకరణ ఆకృతులు, మెరైన్‌ గ్యాస్‌ టర్బైన్లను నావికాదళం కోసం సేకరిస్తారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఎయిర్‌ రూట్‌ సర్వైలెన్స్‌ రాడార్ల స్థానంలో ‘ఆరుద్ర’లను ప్రవేశపెట్టనున్నారు. 

యుద్ధనౌకల చాలనం కోసం మెరైన్‌ గ్యాస్‌ టర్బైన్లను వాడతారు. నావికా దళానికి అవసరమైన పరికరాల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గించడం ద్వారా వాటి ఆకృతులను భారత్‌లోనే అభివృద్ధి చేయనున్నారు.  వివిధ నావల్ ఎయిర్ స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న ఎయిర్ రూట్ సర్వైలెన్స్ రాడార్ల స్థానంలో ఈ అత్యాధునిక ఆరుద్ర రాడార్లను ప్రవేశపెట్టనున్నారు. 

యుద్ధ సమయాల్లో క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో అత్యంత సంక్లిష్టమైన మిషన్లలో కీలకంగా వ్యవహరించే అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, ట్రాల్ ట్యాంకులు, సర్వత్ర బ్రిడ్జ్ సిస్టమ్‌, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది.  ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, హెలికాప్టర్లను వాయుసేన కోసం సేకరిస్తారు. అలాగే, గ్రౌండ్‌ బేస్డ్‌ మల్టీపర్పస్‌ జామర్లు, సెక్యూర్‌ అసెస్‌ కార్డు సిస్టమ్‌లను కూడా సేకరించాలని ‘డీఏసీ’ నిర్ణయించింది.

సుఖోయ్‌-30 నవీకరణకు గ్రీన్‌సిగ్నల్‌

వాయుసేనను మరింత బలోపేతం చేస్తూ కీలక నిర్ణయాన్ని రక్షణ శాఖ తీసుకుంది. గగనతలం నుంచి గగనతలం వరకు దూసుకెళ్లే ఆర్‌వీవీ బీడీ క్షిపణుల్లో అమరేలా సుఖోయ్‌- 30 ఎమ్‌కేఎల్‌ ఫైటర్లను నవీకరించాలని నిర్ణయించింది. దానివల్ల 300 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాన్ని అత్యంత వేగంతో పూర్తి కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం లభిస్తుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. 

బ్రిక్స్‌ సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లదమీర్‌ పుతిన్‌ భారత్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుఖోయ్‌లకు సంబంధించిన ప్రతిపాదనను రక్షణ శాఖ పరిశీలిస్తుండటం గమనార్హం. పుతిన్‌ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇందులో సుఖోయ్‌- 30 నవీకరణ అంశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

శత్రువులకు ముకుతాడు వేసేలా సవాలుతో కూడిన ప్రాంతాల్లో అత్యంత వేగంగా, సమర్థవంతంగా మందుపాతరలను అమర్చేందుకు సెల్ఫ్-ప్రొపెల్డ్ మెకానికల్ మైన్ లేయర్స్ కొనుగోలుకు సైతం ఆమోదముద్ర వేసింది. రక్షణ వ్యవస్థల భద్రతను డిజిటలైజ్ చేస్తూ ‘డిఫెన్స్ ఫోర్సెస్ సెక్యూర్ యాక్సెస్ కార్డ్‌’ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు డీఏసీ అంగీకారం తెలిపింది. దీని ద్వారా దళాల్లో ఇప్పటివరకు ఉన్న పాత పేపర్ గుర్తింపు కార్డులు, పాస్‌లు, పర్మిట్ల స్థానంలో పరస్పరం పనిచేసే అత్యాధునిక స్మార్ట్ కార్డులను అమలు చేయనున్నారు.