పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాది జరగనున్న దుర్గా పూజ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను సోమవారం ప్రకటించింది. ఇందులో భాగంగా, 2017లో అప్పటి టీఎంసీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక ‘పూజా కార్నివాల్’ను రద్దు చేయడం, మహా అష్టమి రోజున మద్యం అమ్మకాలను నిషేధించడం వంటి చర్యలు ఉన్నాయి. అయితే, పూజా కమిటీలకు రూ. లక్ష వరకు ఆర్థిక సహాయం అందించే విధానాన్ని కొన్ని షరతులతో బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది.
కోల్‌కతాలోని మిలన్ మేళా మైదానంలో రాబోయే పండుగ ఏర్పాట్లపై జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వ హయాంలో జరగనున్న తొలి దుర్గా పూజలో భారీ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ ప్రదర్శనలు, బాణసంచా ప్రదర్శనలు ఉంటాయని ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు.
క్రమశిక్షణను పాటించడం, పండుగ సంప్రదాయ స్వభావాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, పూజా కమిటీలు తమ విగ్రహాలు, పండళ్లు, థీమ్‌లు (అంశాలు) ఎట్టి పరిస్థితుల్లోనూ మతపరమైన భావనలను దెబ్బతీయకుండా లేదా సనాతన సంప్రదాయాలకు భంగం కలిగించకుండా చూసుకోవాలని ఆయన కోరారు.
“థీమ్ ఆధారిత పూజలకు అనుమతి ఉంటుంది,” అని పేర్కొన్న ఆయన, నిర్వాహకులు తమ థీమ్‌లను ఎంచుకునేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని సూచించారు. దుర్గా పూజ వేడుకల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పండగలో అత్యంత పవిత్రమైన రోజైన మహా అష్టమినాడు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్యం నిషేధాన్ని విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారిప్రకటించారు.
ఆ రోజున భక్తులు దుర్గాదేవికి అత్యంత భక్తిశ్రద్ధలతో పుష్పాంజలి సమర్పిస్తారని, ఆ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంచేశారు. ఈ ఏడాది అక్టోబర్ 19న మహా అష్టమి పర్వదినం జరగనుంది. దుర్గా పూజ ఉత్సవాల్లో భాగంగా మహా అష్టమి నాడు మద్యంపై నిషేధం విధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.
అదే సమావేశంలో ఆర్థిక సహాయం అవసరమైన దుర్గా పూజ కమిటీలకు రూ.1 లక్ష చొప్పున గ్రాంటు మంజూరు చేస్తామని తెలిపారు. వీటితోపాటు ఉత్సవాల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు, ఫైర్ సేఫ్టీ లైసెన్సుల ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్థికంగా బలంగా ఉండి, పెద్ద మొత్తంలో నిధులు కలిగిన కమిటీలు స్వచ్ఛందంగా ఈ గ్రాంటును వదులుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విగ్రహాల నిమజ్జన ఊరేగింపులో డీజే మ్యూజిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అక్టోబర్ 25న లక్ష్మీ పూజ ఉన్నందున అంతకు ముందే నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. దుర్గా పూజకు యునెస్కో వారసత్వ గుర్తింపు లభించిన సందర్భంగా ప్రతి ఏటా ‘రెడ్ రోడ్’పై నిర్వహించే ‘పూజా కార్నివాల్’ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
“గత కొన్నేళ్లుగా దుర్గా పూజ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్నివాల్ ఈ ఏడాది జరగదు. దానికి బదులుగా, పండుగ సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక శాఖ, సమాచార-సాంస్కృతిక వ్యవహారాల శాఖలు సంయుక్తంగా ‘ఈడెన్ గార్డెన్స్’లో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమంలో నాలుగు గంటల పాటు డ్రోన్, బాణసంచా ప్రదర్శనలు ఉంటాయి; అలాగే దుర్గా పూజకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి,” అని ఆయన పేర్కొన్నారు.
మహాలయ తర్వాత తీరప్రాంత పట్టణమైన ‘దీఘా’లో ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని, అలాగే రాష్ట్రంలోని ఆరు నగరాల్లో రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారి తెలిపారు. ఈ ప్రత్యేక మహాలయ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.కాగా, దుర్గా పూజ సమయంలో బెంగాలీలు మాంసాహారం తీసుకోవడాన్ని నిషేధించాలని బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి అలియాస్ బాగేశ్వర్ బాబా చేసిన అభ్యర్థనను బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య తోసిపుచ్చారు. పండుగ సమయంలో బెంగాలీలు ఏమి తినాలనేది నిర్ణయించే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు.
గతంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పాలనలో పశ్చిమ బెంగాల్‌లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి బాగేశ్వర్ బాబాకు అనుమతి నిరాకరించారు. అయితే ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో ఆదివారం హౌరాలో జరిగిన ఒక ప్రవచన కార్యక్రమంలో మాట్లాడుతూ నవరాత్రి సందర్భంగా దుర్గా పూజ నిర్వహించే సమయంలో బెంగాలీలు మాంసాహారం, మద్యం తీసుకోవడాన్ని నిషేధించాలని ఆయన కోరారు. దుర్గా పూజ సమయంలో మాంసాహారం తీసుకునేవారు అపవిత్రులని ఆయన పేర్కొన్నారు.

More Stories
బిఆర్ఎస్ ఎమ్యెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి అరెస్ట్
పశ్చిమాసియా ఘర్షణలతో ఢిల్లీ బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి ప్రకటన సాధ్యమా?
రూ.1.10 లక్షల కోట్లతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలు