* ఢిల్లీ యూనివర్సిటీలో ఏడు లక్షల మందికి 8 వేల హాస్టల్ గదులు.. గత్యంతరం లేకనే పీజీల్లో బస
ఢిల్లీ నగరంలో ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న పీజీ హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, కనీస సౌకర్యాలపై ఢిల్లీ హైకోర్టు పలు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. ఢిల్లీ పరిధిలో పీజీ హాస్టళ్ల ఏర్పాటు, అక్కడి వసతులకు సంబంధించి ఏవైనా నిర్దిష్ట నిబంధనలు లేదా మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయా? అనే అంశంపై పూర్తి వివరణాత్మక స్పందనను నివేదిక రూపంలో సమర్పించాలని మున్సిపల్ కార్పొరేషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు ఢిల్లీ విశ్వవిద్యాలయం కూడా ఈ విచారణ పరిధిలోకి వచ్చింది. తమ విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కళాశాలల్లో చేరిన ఇతర ప్రాంతాల విద్యార్థుల సంఖ్య ఎంత? యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్న కళాశాలలు స్వయంగా నిర్వహిస్తున్న అధికారిక హాస్టళ్ల సంఖ్య ఎంత? అనే వివరాలకు సంబంధించిన పూర్తి డేటాను అందించాలని డీయూ యాజమాన్యాన్ని న్యాయస్థానం స్పష్టంగా కోరింది.
దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఐదంతస్తుల హాస్టల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఘోర ప్రమాదంపై ఢిల్లీ హైకోర్టు అత్యంత తీవ్రంగా స్పందించింది. అనధికారిక నిర్మాణాలు, అధికారులు వహించిన నిర్లక్ష్యంపై న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సదరు ప్రమాదకర భవన నిర్మాణానికి, అనుమతులకు బాధ్యులైన ప్రభుత్వ అధికారులు గనుక తమ విధులను సక్రమంగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించి ఉంటే ఈ ఘోర విషాదం జరిగి ఉండేది కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
భవిష్యత్తులో ఇలాంటి ప్రాణాంతక ఘటనలు పునరావృతం కాకుండా అరికట్టేందుకు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ), ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ), జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హాస్టల్ భవనం కూలిపోయిన నేపథ్యంలో ఢిల్లీ నగరంలో వెలసిన అనధికార నిర్మాణాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
కాగా, సత్యనికేతన్ ప్రాంతంలో ఎప్పుడైనా కూలిపోయే స్థితిలో భవనాలు చాలానే ఉన్నాయి. ప్రమాదమని తెలిసినా సరే ఏళ్లకు పైబడిన ‘హాస్టల్ డేజ్’ లాంటి భవంతుల్లోనే విద్యార్థులు బస చేయడానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఓ కారణమైతే, యూనివర్సిటీలో సరిపోను గదులు లేకపోవడం మరో కారణం. విశ్వవిద్యాలయం పరిధిలో దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ఉండగా, హాస్టళ్లలో 8 వేల గదులు మాత్రమే ఉన్నాయి. దాంతో గత్యంతరం లేక సమీపంలోని సత్య నికేతన్‌లోని ఇరుకుగా ఉండేపీజీ హాస్టళ్లలో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. యూనివర్సిటీ రికార్డుల ప్రకారం 2024-25 విద్యాసంవత్సరంలో దాదాపు 2.5 లక్షల మంది కోర్సుల్లో చేరారు. అయితే వీరందరికీ హాస్టల్ రూమ్ దొరకదు. 31 మందిలో ఒక్కరికే యూనివర్సిటీ హాస్టల్ గది కేటాయిస్తున్నారు. అంటే సీటు సాధించిన వారిలో కనీసం 10 శాతం మందికి కూడా హాస్టల్ వసతి దూరమవుతోంది. ఈ పరిస్థితుల్లో క్యాంపస్ సమీపంలోని పీజీ హాస్టళ్లలో బస చేస్తున్నారు విద్యార్థులు. దాంతో అద్దెకు ఆశపడి పురాతన భవంతులనే యజమానులు కొనసాగిస్తున్నారు.
భవనం యజమాని, భార్య, కొడుకు అరెస్ట్
కాగా, సత్య నికేతన్ భవనం కూలిపోయిన ఘోర ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు, ఆ పేయింగ్ గెస్ట్ వసతి గృహం యజమాని హరిరామ్ గుప్తాతో పాటు అతని కుమారుడు మహేష్ గుప్తా, భార్య ఊర్మిళా గుప్తాలను అరెస్టు చేశారు.ఈ ముగ్గురు నిందితులను పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచగా,జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ భవ్య ఖరైల్, హరిరామ్ గుప్తా, అతని భార్య ఊర్మిళా గుప్తాలకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా, వారి కుమారుడు మహేష్ గుప్తాకు రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.
సత్య నికేతన్‌లో జరిగిన ఘోర భవన కూలిపోవడం నేపథ్యంలో, నగరంలోని అన్ని పేయింగ్ గెస్ట్ (పీజీ) కేంద్రాలలోని భవనాలకు వారం రోజుల్లోగా నిర్మాణ భద్రతా తనిఖీని పూర్తి చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు అధికారులను ఆదేశించారు. సత్య నికేతన్ దుర్ఘటన తర్వాత తీసుకున్న చర్యలను సమీక్షించేందుకు, విద్యార్థులకు సురక్షితమైన వసతి కల్పించే మార్గాలపై చర్చించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆశిష్ సూద్‌లతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ఆదేశం జారీ చేయబడింది.
More Stories
బిఆర్ఎస్ ఎమ్యెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి అరెస్ట్
పశ్చిమాసియా ఘర్షణలతో ఢిల్లీ బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి ప్రకటన సాధ్యమా?
రూ.1.10 లక్షల కోట్లతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలు