సెన్సెక్స్‌ పతనంతో గంటల వ్యవధిలో రూ 6 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలు, ముడి చమురు ధరలు మండిపోవడం దేశీయ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం ప్రారంభమైన ట్రేడింగ్‌లో సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్‌ ఏకంగా 900 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ కీలకమైన 23 వేల మార్కును కోల్పోయింది.
మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో మదుపర్ల సంపదలో క్షణాల వ్యవధిలోనే సుమారు రూ.6 లక్షల కోట్లు ఆవిరైనట్లు తెలుస్తోంది. దీంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ సుమారు రూ.476 లక్షల కోట్లకు తగ్గింది. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్‌ 907 పాయింట్లు నష్టపోయి 72,988.66 వద్ద కొనసాగింది. మరోవైపు నిఫ్టీ 268 పాయింట్లు దిగజారి 22,871.90 వద్ద ట్రేడైంది.

అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగుతుండటం దేశీయ మార్కెట్లకు ప్రతికూలంగా మారుతోంది. భారత్‌ తన ముడి చమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. చమురు ధరలు పెరిగితే దిగుమతి వ్యయం, ద్రవ్యోల్బణం, కంపెనీల నిర్వహణ వ్యయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా స్వల్పంగా బలహీనపడింది. సోమవారం ఉదయం రూపాయి 14 పైసలు తగ్గి 95.89 వద్ద ట్రేడవుతోంది. స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడితో పాటు రూపాయి కదలికలు కూడా మదుపర్లను అప్రమత్తం చేస్తున్నాయి.   నిఫ్టీ సూచీలోని పలు కీలక షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హిందాల్కో, గ్రాసిమ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

అయితే ప్రతికూల మార్కెట్‌ పరిస్థితుల్లోనూ కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్‌, నిఫ్టీల్లో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ కంపెనీలకు గణనీయమైన వెయిటేజీ ఉండటంతో ఈ రంగ షేర్లు పడిపోవడం ప్రధాన సూచీల పతనాన్ని మరింత తీవ్రతరం చేసింది.

మరోవంక, భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ బాండ్‌ ఈల్డ్స్‌, ముడిచమురు ధరలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి. ముఖ్యంగా ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ ఉన్న భారీ కంపెనీల్లో అమ్మకాలు పెరిగితే సెన్సెక్స్‌, నిఫ్టీలపై దాని ప్రభావం వేగంగా కనిపిస్తుంది.

About The Author