మెట్రో రైలు రంగంలో భారత్ మరో భారీ మైలురాయిని అందుకోబోతున్నది. రాబోయే రెండేళ్లలో అమెరికాను వెనక్కి నెట్టి చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్ కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని విషయాన్ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఒకప్పుడు కేవలం కొన్ని నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు ఇప్పుడు దేశంలోని 26 నగరాలకు విస్తరించాయని మంత్రి చెప్పారు.
రూ. 2,850 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్ మెట్రో రైలు విస్తరణ సేవలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం చైనాలో సుమారు 8,000 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. “అమెరికాలో 1,386 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్‌వర్క్ ఉంది. ఇండోర్ మార్గ విస్తరణతో భారతదేశ మెట్రో రైలు నెట్‌వర్క్ 1,170 కిలోమీటర్లకు చేరింది,” అని చెబుతూ తద్వారా దేశంలోని నెట్‌వర్క్ పొడవు అమెరికా కంటే కేవలం 216 కిలోమీటర్లు మాత్రమే తక్కువగా ఉందని ఆయన గుర్తించారు.
కొత్త మార్గాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి రానుండటంతో భారత్ మెట్రో నెట్‌వర్క్ మరింత వేగంగా పెరగనుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో దేశంలో కేవలం 5 నగరాల్లో 245 కిలోమీటర్ల మేర మాత్రమే మెట్రో రైలు మార్గాలు అందుబాటులో ఉండేవని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, దేశవ్యాప్తంగా 26 నగరాల్లో సుమారు 1,170 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
గడిచిన 12 ఏళ్లలోనే దేశ మెట్రో నెట్‌వర్క్ దాదాపు ఐదు రెట్లు పెరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు పెద్దపీట వేయడంతో కొత్త నగరాల్లోనూ మెట్రో రైలు ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్ కలిగిన దేశంగా ఉంది. చైనా అగ్రస్థానంలో ఉండగా, అమెరికా రెండో స్థానంలో ఉంది.
మెట్రో రైలు కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచే ఒక మార్గం కూడా అని పేర్కొంటూ దీని విస్తరణ 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను నిర్మించే లక్ష్యంతో ముడిపడి ఉందని ఆయన నొక్కి చెప్పారు.

More Stories
జీ గ్రూప్ సుభాష్ చంద్రపై సీబీఐ ఎల్ఐసీ మోసం కేసు!
ప్రత్యేక సుంకాల మినహాయింపులు ఇస్తేనే అమెరికాతో తుది ఒప్పందం
ప్రసూతి సెలవుపై వెడితే హోదా తగ్గిస్తారా?… రూ. 10 లక్షల జరిమానా