ఇన్‌స్టాలో బాలలపై లైంగిక వేధింపుల ప్రకటనలపై `మెటా’కు సమన్లు

ఇన్‌స్టాలో బాలలపై లైంగిక వేధింపుల ప్రకటనలపై `మెటా’కు సమన్లు
భారతదేశంలో బాలలపై లైంగిక వేధింపులను ప్రోత్సహిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల విషయంలో, సోషల్ మీడియా దిగ్గజం మెటా నుంచి వివరణ కోరుతూ, వారి అధికారులను పిలిపించాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించినట్లు శుక్రవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 
ప్రముఖ ఫోటో, వీడియో షేరింగ్ యాప్ అయిన ఇన్‌స్టాగ్రామ్, భారతదేశంలో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రకటనలను నడుపుతోందని పేర్కొంటూ బిబిసి ఒక కధనాన్ని ప్రచురించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. యాప్ మోడరేషన్ టెక్నాలజీ ద్వారా ఆమోదం పొందిన తర్వాతే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలు ప్రచురించబడుతున్నాయని ఆ కధనం పేర్కొంది.
టోలు, వీడియోలు షేర్ చేసే ఇన్‌స్టాగ్రామ్‌ భార‌త్‌లో అశ్లీల కాంటెంట్‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు ఆ క‌థ‌నంలో ఆరోపించారు. చిన్నారుల లైంగిక వేధింపుల‌కు చెందిన చిత్రాలు, వీడియోల‌ను భారత్ లో ఇన్‌స్టాగ్రామ్ ప్ర‌మోట్ చేస్తున్న‌ట్లు ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. ఒళ్లు గ‌గురుపొడిచే రీతిలో ఇన్‌స్టాగ్రామ్ త‌న యూజ‌ర్ల‌ను చైల్డ్ సెక్సువ‌ల్ వీడియోల‌తో రెచ్చ‌గొడుతున్న‌ట్లు ఆ స్టోరీలో రాశారు. రేప్ వీడియో, చైల్డ్ వీడియో అన్న ప‌దాల‌తో ఇన్‌స్టా ఆక‌ర్షిస్తోంద‌ని, వాటికి చెందిన లింకుల‌తోనూ టెలిగ్రాం యాప్ వైపు మొగ్గుచూపే రీతిలో ఇన్‌స్టా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఆ క‌థ‌నంలో తెలిపారు.

`మీరు చూడ‌ద‌లుచుకున్న వీడియోల‌ను ఖ‌రీదు చేయ‌వ‌చ్చు’ అన్న సందేశాలు కూడా ఆ యాప్‌లో క‌నిపిస్తున్న‌ట్లు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్ లో యాడ్స్ ప‌బ్లిష్ చేయాలంటే, వాస్త‌వానికి తొలుత మాడ‌రేష‌న్ టెక్నాల‌జీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంటే ఇన్‌స్టా అనుమ‌తితోనే చైల్డ్ సెక్స్ వీడియోలు ఆ యాప్‌లో ప్ర‌మోట్ అవుతున్న‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. 

అయితే క‌మ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్ర‌కార‌మే త‌మ యాడ్స్ ఉన్న‌ట్లు ఇన్‌స్టా స్పందించిన‌ట్లు తెలిసింది. ఇక ఇన్‌స్టా ఓన‌ర్ సంస్థ మెటా కూడా ఈ అంశంపై రియాక్ట్ అయ్యింది. నేర ప్ర‌వృత్తిని రెచ్చ‌గొట్టే అనేక వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌ను డిజైబుల్ చేశామ‌ని, చాలా వ‌ర‌కు అలాంటి అకౌంట్ల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు మెటా వెల్ల‌డించింది. త‌మ నియ‌మావ‌ళిని ఉల్లంఘించే యూఆర్ఎల్స్‌ను తొల‌గించిన‌ట్లు కూడా ఆ కంపెనీ చెప్పింది.

చైల్డ్ సెక్సువ‌ల్ అబ్యూజ్‌కు చెందిన సుమారు 3 ల‌క్ష‌ల గ్రూపులు, ఛాన‌ల్స్ ఈ ఏడాది తొల‌గించిన‌ట్లు టెలిగ్రాం పేర్కొన్న‌ది. లైంగిక నేర‌ ప్ర‌వృత్తిని ప్రోత్స‌హించే కాంటెంట్‌ను ఇన్‌స్టా త‌న ఫ్లాట్‌ఫామ్‌లో ఎలా ప్ర‌మోట్ చేస్తుంద‌న్న విష‌యాన్ని అనేక ఉదాహ‌ర‌ణ‌ల‌తో బీబీసీ త‌న క‌థ‌నాన్ని ఆన్‌లైన్‌లో ప‌బ్లిష్ చేసింది. చైల్డ్ సెక్సువ‌ల్ అబ్యూజ్ ఫిర్యాదుల‌ను స్వీక‌రించేందుకు అమెరికాలో ఎన్సీఎంఈసీ సైబ‌ర్ టిప్‌లైన్ సంస్థ ఉన్న‌ది.  ఇలాంటి వ్య‌వ‌స్థ కూడా భార‌త్‌లో ప‌నిచేస్తున్న‌ది.

భార‌త్‌లో 2025లో సుమారు 19 ల‌క్ష‌ల ఫిర్యాదులు స్వీక‌రించిన‌ట్లు తెలిసింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ పైనే ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వ‌స్తున్న‌ట్లు తెలంగాణ సైబ‌ర్ సెక్యూర్టీ బ్యూరో డైరెక్ట‌ర్ శిఖా గోయ‌ల్ కూడా ఆ క‌థ‌నంలో అభిప్రాయ‌ప‌డ్డారు.  చైల్డ్ సెక్సువ‌ల్ అబ్యూజ్‌ను ట్రాక్ చేసే ఆల్గారిథ‌మ్ ఎంత ప‌టిష్టంగా ఉంటే, అప్పుడు ఎక్కువ సంఖ్య‌లో అల‌ర్ట్స్ జారీ అవుతాయ‌ని శిఖా గోయ‌ల్ పేర్కొన్నారు. బిబిసీలో ప‌నిచేస్తున్న అవార్డు విన్నింగ్ జ‌ర్న‌లిస్టు దివ్యా ఆర్యా ఈ సంచ‌ల‌న క‌థ‌నాన్ని రాశారు. త‌మ వెబ్‌సైట్‌లో బీబీసీ ఈ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.