ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న రామమందిరానికి సంబంధించిన విరాళాల దుర్వినియోగం లేదా చోరీ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరగాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శుక్రవారం పిలుపునిచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ విషయంలో కఠిన చర్యలు అవసరమని పేర్కొన్న ఆర్‌ఎస్‌ఎస్, ఈ ఘటన పట్ల భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపింది.
ఒక వీడియో ప్రకటనలో, ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే హిందువులు సంయమనం పాటించాలని కోరారు. హిందూ వ్యతిరేక శక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని హిందూమతంపై తప్పుడు ప్రచారం చేసేందుకు వీలు కల్పించకూడదని ఆయన హెచ్చరించారు. అలాగే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
“తరతరాల పోరాటాలు, కోట్లాది మంది రామ భక్తుల అంకితభావం, త్యాగం, బలిదానాల ఫలితంగా శ్రీరామ జన్మభూమిలో నిర్మితమైన ఈ అద్భుతమైన ఆలయం, సమస్త హిందూ సమాజానికి గౌరవ, విశ్వాస, భక్తి కేంద్రంగా మారింది. అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ఆలయంలోని విరాళాల పెట్టెల నుండి సొమ్ము చోరీకి గురైన దురదృష్టకర ఘటన.సమాజం, రామ భక్తుల మనోభావాలను, శ్రద్ధాభక్తులను గాయపరిచింది. ఈ సంఘటన మన అందరినీ బాధించింది” అని తెలిపారు.
“శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసి, వారి సిఫార్సుల ఆధారంగా చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. విచారణలో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్ష పడేలా చూడటం అత్యవసరం. అయోధ్య ఆలయం పట్ల కోట్లాది మంది రామ భక్తులకు ఉన్న విశ్వాసం, భక్తి చెక్కుచెదరకుండా ఉండేలా చూసేందుకు, ఏర్పాట్లు, నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి అత్యంత చిత్తశుద్ధితో సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ట్రస్ట్ ఆశిస్తోంది” అని చెప్పారు.
“అలాగే, అత్యంత ఖండించదగిన ఈ ఘటనను ఒక అసాధారణ అంశంగా పరిగణించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, సమస్త హిందూ సమాజం ఆశిస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న గందరగోళం, అనిశ్చితి తొలగిపోవాలి. ఈ నేపథ్యంలో, ఆలయ యాజమాన్యం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాయని మేము ఆశిస్తున్నాము” అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.
“సరైన ఆర్థిక నిర్వహణ, నిష్కళంకమైన పారదర్శక వ్యవస్థలతో కూడిన నిరాటంకమైన కార్యకలాపాలు, పవిత్రత, ప్రగాఢమైన భక్తిభావంతో నిండిన వాతావరణం ద్వారా, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ హిందూ సమాజం విశ్వాసాన్ని, నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము” అంటూ ఆయన తెలిపారు.
ఈ క్లిష్ట సమయంలో అవసరమైన ఓర్పును, సంయమనాన్ని ప్రదర్శించాలని, అలాగే ఈ దురదృష్టకర సంఘటనను ఆసరాగా చేసుకుని హిందూ ధర్మాన్ని, సమాజాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్న హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను భగ్నం చేయాలని యావత్ హిందూ సమాజానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజ్ఞప్తి చేస్తున్నట్లు హోసబలే చెప్పారు.

More Stories
ఈసీలో ఎస్ఐఆర్ పై `అసమ్మతి’లేదు, `భిన్నాభిప్రాయాలు’ సహజం!
భారతీయ ఉన్నత విద్యా ప్రాంగణాల్లో ప్రమాదకర ‘వోక్-జిహాదీ’ భావజాలం
ఐఐటీ బొంబాయి విద్యార్థి ఆత్మహత్య కేసులో సెలవుపై ప్రొఫెసర్ దూల్లా