దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ‘బీజేపీ మహాపాదయాత్ర’ అశేష జనవాహిని మధ్య అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమై విజయవంతంగా ముగిసింది. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో కాషాయ జెండా ఎగురవేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ సునీల్ బన్సల్ కు స్వాగతం పలుకుతూ, 3 కిలోమీటర్ల పాదయాత్రలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని శాంతినగర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ మహాపాదయాత్రలో బిజెపి రాష్ట్ర సహ ఇన్చార్జి రేఖా శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, జి. నగేష్ గారు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ సహా పార్టీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.
బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విదేశీ కుట్రలతో నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలను భారత్‌లోనూ సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే జెన్ జెడ్, జెన్ భారత్ అలాంటి కుట్రలను అనుమతించబోదని, యువత దేశం వైపే నిలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తూ, వారి సమస్యలను పక్కనపెట్టి ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ కోట్లాది ప్రజల గుండెల్లోంచి పుట్టిన నాయకుడని పేర్కొంటూ పది బొద్దింకలు ఆయనను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఓటు చోరీ అంటూ ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ, ఇప్పటివరకు ఎన్ని ఓట్లు తొలగించారో ఆధారాలతో చెప్పగలరా అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాల పేరుతో 3 కోట్ల ఓట్ల కోసం కాంగ్రెస్ చేస్తున్న తపన, తాపత్రయం ఏమిటని నిలదీశారు. ఓట్లతోనే గెలిచామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు, తమ గ్రామాల్లో ఒక్క ఓటైనా తొలగించారా? అని ప్రజలను అడగాలని ఆయన కోరారు.
రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్ అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితిని కనీసం పట్టించుకోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ‘ఓట్ చోరీ’ అంటూ అసత్య ప్రచారాలు, రాజకీయ నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్లు. ది ఓట్ చోరీ కాదని, అసలు ఆయన బ్రెయినే చోరీ అయిందని, అటు గాంధీ పేరును దొంగిలించి రాహుల్ గాంధీ ‘నామ్ చోరీ’కి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరు దొంగలు కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా రూ. 12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి అవినీతికి మారుపేరుగా నిలిచిందని రాంచందర్ రావు గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి, గ్రామగ్రామానా బీజేపీని మరింత పటిష్టం చేయాలని, భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

More Stories
చొరబాటు, జనాభా స్వరూపం, జాతీయ భద్రత దృష్ట్యా ‘ఎస్ఐఆర్’
ఢిల్లీలో రచ్చకెక్కిన కాంగ్రెస్ నేతల అంతర్గత కుమ్ములాటలు!
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు కేంద్రం రూ 275 కోట్లు