తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత, బహిరంగ విభేదాల పరంపరను ఎదుర్కొంటోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సొంత పార్టీ సహచరులపై గళం విప్పుతున్నారు. ఢిల్లీలో రచ్చకెక్కిన ఈ అంతర్గత కుమ్ములాటలు రాష్ట్ర కాంగ్రెస్‌ను ఇబ్బందికరమైన స్థితిలోకి నెట్టింది. అక్కడ రాష్ట్ర మంత్రి సి. దామోదర్ రాజా నరసింహ, జుక్కల్ ఎమ్మెల్యే టి. లక్ష్మీకాంతారావు ఒక హోటల్లో అందరూ చూస్తుండగానే తీవ్ర వాగ్వాదానికి దిగారు.
మంత్రి, ఎమ్మెల్యే ‘నువ్వెంత.. అంటే నువ్వెంత’ అన్నట్టుగా చెలరేగిపోయారు. మంత్రి ఒకడుగు ముందుకేసి ‘నాతో పెట్టుకుంటే’.. ‘ఎక్కువ మాట్లాడితే’.. ‘పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే’ ఇదే హోటల్ రూములో పడేసి కొడ్తా బిడ్డా’ అంటూ హెచ్చరించినట్టు తెలిసింది. ఈ విషయమై ఆ మంత్రి ధోరణిని ఎండగడుతూ ఆ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. ఇద్దరూ ఒకరినొకరు బెదిరించుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, దుర్భాషలాడుకోవడం చూసి సొంత పార్టీ నేతలే విస్మయంకు గురయ్యారు.
ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన రామలీల తొలి ర్యాలీలో పాల్గొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకం, ఇతర సంస్థాగత పదవుల విషయంలో అల్పాహారం తీసుకుంటున్నప్పుడు పరస్పరం వాగ్వాదానికి దిగిన్నట్లు చెబు తున్నారు. అయితే, జిల్లాలో ఇసుక తవ్వకాలే అసలు సమస్య అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముడుపులు పంచుకోవడంలో పరస్పరం దుర్భాషలకు దిగారని చెప్పుకొంటున్నారు.
ఇదిలా ఉండగా, పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు వర్గానికి, మంత్రి జి. వివేక్ వెంకటస్వామి కుమారుడు, ఎంపీ గద్దం వంశీ కృష్ణ మద్దతుదారులకు మధ్య కూడా ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికారిక కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాల్లో తనను పక్కన పెడుతున్నారని ఎంపీ మద్దతుదారులు ఆరోపిస్తుండగా, ప్రోటోకాల్ పాటిస్తున్నామని మంత్రి మద్దతుదారులు వాదిస్తున్నారు. ఢిల్లీ ర్యాలీకి హాజరుకాని ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలను వ్యతిరేకిస్తూ వంశీ కృష్ణ ఇటీవల శ్రీధర్ బాబుకు లేఖ రాయడం, ఈ విభేదాలకు మరో కోణాన్ని జోడించింది.
నల్గొండలో, నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని బహిరంగంగా ప్రశ్నించారు. “ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌కు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారా? లేక యావత్ తెలంగాణకు ఉన్నారా?” అని ఆయన ప్రశ్నించారు. హుజూర్నగర్, కోదాడ్లకు నిధులు మళ్లిస్తూ మునుగోడును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తన నియోజకవర్గాన్ని మార్చడానికి రూ. 300 కోట్లు సరిపోతాయని, నిధుల కోసం తాను ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలా పోరాడవలసి వస్తోందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ పరిస్థితికి తోడు, దాదాపు రూ. 40 కోట్ల విలువైన పెండింగ్ అభివృద్ధి బిల్లులను ఆమోదించకపోతే, 30,000 మందితో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని జడ్చర్ల ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి హెచ్చరించడం ఈ ఇబ్బందిని మరింత పెంచింది. “నా మరణం తర్వాతే ప్రభుత్వం స్పందిస్తుందా?” అని ఆయన ప్రశ్నించారు.
నిధులు విడుదల చేసి, పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను ఆయన కోరారు. సంస్థాగత నియామకాలు, రాజకీయ నియమావళి, అభివృద్ధి నిధుల విషయంలో విభేదాలతో, తెలంగాణలోని కాంగ్రెస్ తన సొంత శ్రేణుల్లోనే ప్రజా వ్యతిరేకతను అణచివేసే సవాలును ఎదుర్కొంటోంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న రాజకీయ సవాళ్లకు తోడుగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2న హైదరాబాద్‌లో బిజెపి జరిపిన పాదయాత్రలో పాల్గొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, తెలంగాణను “ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ నాయకులకు ఏటీఎం”గా మార్చేశారని అమిత్ షా ఆరోపించారు. ఆయన “ఆర్ఆర్ ట్యాక్స్” అనే పదాన్ని కూడా ఉపయోగించారు.

More Stories
చొరబాటు, జనాభా స్వరూపం, జాతీయ భద్రత దృష్ట్యా ‘ఎస్ఐఆర్’
అశేష జనవాహిని మధ్య నిర్మల్ లో ‘బీజేపీ మహాపాదయాత్ర’
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు కేంద్రం రూ 275 కోట్లు