పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి.. బీజేపీలో ఎవరైనా చేరవచ్చు

పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి.. బీజేపీలో ఎవరైనా చేరవచ్చు
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అసమ్మతి నేతలు భారతీయ జనతా పార్టీలో చేరవచ్చన్న ఊహాగానాల మధ్య, ఆ పార్టీ పంజాబ్ విభాగం అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ స్పందిస్తూ, ఎవరైనా బీజేపీలో చేరవచ్చని ఆహ్వానించారు. కాంగ్రెస్ ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావడంపై అడిగిన ప్రశ్నకు ధిల్లాన్ బదులిస్తూ, బీజేపీ ఎవరితోనూ సంప్రదింపులు జరపడం లేదని, అయితే పార్టీ విధానాలకు అనుగుణంగా ఎవరైనా చేరాలనుకుంటే వారికి స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు.
 
రంధావా-అమిత్ షా భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతల ఉద్దేశాలపై ఊహాగానాలు పెరగడం, తద్వారా ఆ పార్టీలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందన్న చర్చ బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. రంధావా లేదా మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ వంటి నేతలు బీజేపీలో చేరే అవకాశం పట్ల పార్టీ నాయకులు సానుకూల దృక్పథంతో ఉన్నారు.
 
వీరిద్దరికీ ఏళ్ల తరబడి రాజకీయ అనుభవం ఉండటంతో పాటు, తమకంటూ ప్రత్యేక కార్యకర్తల బృందం, అనుచర గణం కూడా ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు అడిగినప్పుడు ధిల్లాన్ పెద్దగా స్పందించలేదు, కానీ పార్టీ మారాలనుకునే ఏ కాంగ్రెస్ నేతకైనా బీజేపీ తలుపులు మూసివేయదని చెప్పడానికి ఆయన వ్యాఖ్యలు ఒక సంకేతంగా భావిస్తున్నారు. 
 
2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌లో చేపట్టిన సంస్థాగత నియామకాలు పార్టీలో అసమ్మతికి దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ రాజకీయ బలప్రదర్శనకు పూనుకున్నారు. చంకౌర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని తన స్వస్థలం మోరిండా పట్టణంలోని తన నివాసంలో దాదాపు రెండు డజన్ల మంది మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో చన్నీ సమావేశమయ్యారు.
 
ప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా అమరీందర్‌ సింగ్‌ రాజాను కొనసాగించాలన్న పార్టీ అధిష్ఠాన నిర్ణయంపై చన్నీ వర్గం లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పార్టీ అధిష్ఠానానికి ఒక వారం రోజుల వ్యవధిని ఇస్తున్నట్లు చన్నీ వర్గం ప్రకటించింది.