దేశీ గోవుల సంరక్షణ, గోసేవ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గోపాల్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలో ‘వాక్ టూ హీల్’ వాకథాన్ నిర్వహించింది. నగవరనంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇస్కాన్ గోశాల, కామధేను గో సంరక్షణ శాల సహకారంతో స్థానిక జాతి పుంగనూరు ఆవులకు ప్రత్యేకంగా గోపూజ నిర్వహించారు.
రోటరీ నెక్ట్స్జెన్, ప్లాస్టిక్ ఫ్రీ తిరుమల ప్రతినిధులు, ఎకో సేవియర్స్, విద్యార్ధులు, నగరప్రజలతో కలిసి వాకథాన్ చేపట్టారు. దేశీయ గోవుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ గోపాల్స్ సంస్థ రైతులు, పౌరులను, విద్యార్థులను చైతన్యపరిచారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విత్తన బంతుల కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేశారు.
గోవు అనేది కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా, వైజ్ఞానికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిందని గోపాల్స్ సంస్ధ నిర్వాహకులు తెలిపారు. ఆవును గోశాలకే పరిమితం చేయకుండా సహజసిద్ధంగా మేతకు తీసుకెళ్లాలని చెప్పారు. తద్వారా భూమితో పాటు మన ఆరోగ్యం కూడా మెరుగవుతుందని వివరించారు. తిరుపతిలో గో సండే, గో సాటర్డే కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రజలను, విద్యార్థులను గోసేవలో భాగస్వాములను చేస్తున్నామని నిర్వాహకులు వివరించారు.
“12 సంవత్సరాల క్రితం బెంగుళూరులో నలుగురు ఐటీ ఉద్యోగులతో ఈ ఆలోచన మొదలైంది. గోసేవలో అందరిని భాగస్వామ్యం చేయడంతో పాటు గోసేవపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. మొదటగా గోవిందుడి క్షేత్రంలో ఈ ‘వాక్ టూ హీల్’ వాకథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది” అని నిర్వాహక బృందం సభ్యుడు రాజేష్ తెలిపారు. రాబోయే కాలంలో ప్రతి కుటుంబం దేశీయ ఆవు ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, కెమికల్స్ లేని వ్యవసాయానికి ఆవు పేడ, గోమూత్రం ఎంతో అవసరమని ప్రకృతి వ్యవసాయదారులు తెలిపారు.

More Stories
రూ. 10 వేల కోట్ల పెట్టుబడితో రాయలసీమ అభివృద్ధి
గుండ్లకమ్మ లాంటి జీవనదులను రక్షించుకోవాలి
ప్రభుత్వ సిలబస్ అమలు చేయని కార్పొరేట్ విద్యా సంస్థలు