‘పీఎం-సేతు’ ద్వారా ఏపీకి మొదటి వ్యూహాత్మక పెట్టుబడి

‘పీఎం-సేతు’ ద్వారా ఏపీకి మొదటి వ్యూహాత్మక పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యా పరివర్తనలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన రూ. 60,000 కోట్ల ‘పీఎం-సేతు’ (ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా అప్‌గ్రేడ్ అయిన ఐటిఐలు) పథకం కింద దేశంలోనే మొట్టమొదటి వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక (ఎస్ఐపి) ఆమోదాన్ని ఏపీ సొంతం చేసుకుంది. 
 
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆర్సెలార్­మిత్తల్ నిప్పోన్ స్టీల్ ఇండియా, తన విద్యా భాగస్వామి అయిన ‘నామ్‌టెక్’  సంస్థతో కలిసి ప్రతిపాదించిన విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ ప్రణాళికకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ నిర్దేశక కమిటీ (ఎన్ ఎస్ సి) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
న్యూఢిల్లీలోని కౌశల్ భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో లభించిన ఈ ఆమోదంతో, పీఎం-సేతు పథకం కింద ఒక ప్రముఖ పారిశ్రామిక భాగస్వామ్యాన్ని (యాంకర్ ఇండస్ట్రీ పార్ట్‌నర్) అధికారికంగా అమలులోకి తెచ్చిన తొలి భారతీయ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి దేబాశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి, శిక్షణ సంచాలక శాఖ డైరెక్టర్ జనరల్ దిలీప్ కుమార్, జాతీయ నిర్వాహక కమిటీ సభ్యులు హాజరయ్యారు.

ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా విశాఖపట్నంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటిఐలు) ఇకపై పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, ఫలితాల-ఆధారిత సాంకేతిక విద్యా కేంద్రాలుగా రూపాంతరం చెందనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘హబ్-అండ్-స్పోక్’ నమూనా ఆధారంగా ఈ క్లస్టర్ పనిచేస్తుంది. దీనివల్ల అధునాతన తయారీ రంగం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 

దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకంలో ఏపీ సాధించిన ఈ విజయం, పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయాలనుకుంటున్న ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుంది. ‘వికసిత్ భారత్ 2047’ దార్శనికతకు అనుగుణంగా, భవిష్యత్ శ్రామిక శక్తి అవసరాలను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ రంగాలు కలిసికట్టుగా వేసిన ఈ అడుగు పారిశ్రామిక రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుందని నిపుణులు అభివర్ణిస్తున్నారు.