అమరావతిలో తొలిసారి జగన్నాథ రథయాత్ర  

అమరావతిలో తొలిసారి జగన్నాథ రథయాత్ర  
రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి జగన్నాథ రథయాత్రకు శ్రీకారం చుట్టారు. రథాన్ని లాగే ముందు ఒడిశాలోని పూరీలో జగన్నాథ స్వామికి నిర్వహించే ప్రత్యేక పూజలను సీఎం చంద్రబాబు నిర్వహించారు.
 
అనంతరం అమరావతి రాజధాని నగర బృహత్ ప్రణాళికతో కూడిన చిత్ర పటాన్ని తలపై పెట్టుకుని అమరావతి విశ్వ నగరంగా ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పూరీలో నిర్వహించే సంప్రదాయ క్రతువులో భాగంగా జగన్నాథ రథం ముందు భాగాన్ని బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. ఆపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మలు ఆశీనులైన రథాన్ని తాడుతో లాగారు. 
 
సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక శాసనసభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు రథాన్ని లాగారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ భారతదేశంలో జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రత్యేకత ఉందని పేర్కొంటూ ఒడిశాలోని పూరీలో జరిగే రథయాత్రలో అందరూ పాల్గొనడం సాధ్యం కాదని, ఇక నుంచి ప్రతిఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇస్కాన్ ప్రకటించడం సంతోషదాయకమని తెలిపారు. 
 
పూరీ రథయాత్రకు ఎంతో విశిష్టత ఉందని, అలాంటి కార్యక్రమాన్ని అమరావతిలోనూ చేపట్టడం ఆనందంగా ఉందని సీఎం పేర్కొన్నారు.  మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయని, సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం సమాజంపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని కారణంగా కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు, చిన్నారులపై అఘాయిత్యాలు వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. 
 
మన జీవితాల్లో ఒత్తిడి దూరం కావాలంటే ఆధ్యాత్మికత ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. మైక్రో ఫ్యామిలీలు కాకుండా ఉమ్మడి కుటుంబాలు ఉండాలని, అదే భారతీయ సంప్రదాయమని చెప్పారు. సమస్యలను, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనేలా ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పీలో 5 వేల శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు.
సమాజం మొత్తాన్ని ప్రశాంతంగా ఉంచే క్షేత్రాలే దేవాలయాలని, వాటి ఆధ్యాత్మిక శోభకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. నాణ్యమైన జీవనం లేకపోతే ఎంత సంపద ఉన్నా నిరర్థకమని గుర్తించాలని సూచించారు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు ఇస్కాన్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జగన్నాథ స్వామి రథయాత్ర తలపెట్టగానే అమరావతిలో వర్షం కురిసి చల్లని వాతావరణం ఏర్పడిందని చెబుతూ ఆ స్వామి కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.