ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ముద్రగడ సుదీర్ఘ కాలం పాటు వివిధ పార్టీల్లో పనిచేశారు. ఉమ్మడి ఏపీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో 22 జనవరి 1953న జన్మించారు.
ఆయన తండ్రి వీరరాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో తండ్రి మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతాపార్టీ తరఫున ప్రత్తిపాడు నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1982లో తెలుగుదేశంలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు.
అనంతరం పార్టీతో విభేదించిన ముద్రగడ పద్మనాభం 1988లో మంత్రి పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పేర్లతో పార్టీలు స్థాపించిన ఆయన 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రత్తిపాడు నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
1994 ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఓటమి చవిచూశారు. 1999లో కాకినాడ నుంచి బిజెపి అభ్యర్థిగా ఎంపీగా గెలుపొంది పార్లమెంట్కు వెళ్లారు. 2004లో తెలుగుదేశం తరఫున కాకినాడ ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. 2009లో హస్తం పార్టీలో చేరి ఆ ఏడాది పిఠాపురం నుంచి పోటీ చేసి పరాజయం చెందారు.
1994లో కాపు రిజర్వేషన్ల సాధన కోసం కోనసీమలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 30ని జారీ చేసింది కాపు రిజర్వేషన్ల డిమాండ్ తో 2016 జనవరిలో తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాపు ఐక్య గర్జన సభ’ హింసాత్మకంగా మారింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం సహా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతా తన నివాసంలో రిజర్వేషన్ల కోసం ఆయన దీక్షలు చేశారు.
చాలాకాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల ప్రచార సమయంలో పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించడంతో తాను చేసిన సవాల్కు కట్టుబడి తన పేరు మార్చుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించారు.
ముద్రగడ పద్మనాభం తుదిశ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా ముద్రగడ సేవలందించారని గుర్తుచేశారు. ముద్రగడ కుటుంబసభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వివరించారు.

More Stories
టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులతో స్మృతి మందాన సంచలనం
ప్రధాని మోదీని ఎగతాళి చేస్తూ రాహుల్ ప్రదర్శన.. మండిపడ్డ బిజెపి
ఇరాన్ యుద్ధంతో అదుపు తప్పుతున్న ఆహార ధరల ద్రవ్యోల్బణం