తాడిచెర్ల తెలంగాణకు ఒక గొప్ప సంపద 

తాడిచెర్ల తెలంగాణకు ఒక గొప్ప సంపద 
తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన సంపద అని, ఇది కేవలం తాడిచెర్లకే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ఒక ‘కిరీటమణి’గా నిలుస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రెండో రోజు తాడిచెర్ల గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాలుగా తడిచెర్ల బొగ్గు బ్లాక్ సాధనలో ఎదురైన వివిధ అడ్డంకులను వివరిస్తూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ అంశం మొదటిసారి చర్చకు వచ్చిందని మంత్రి తెలిపారు. 
 
అయితే, ఈ కీలక అంశంపై ఏళ్ల తరబడి సాగిన జాప్యానికి ముగింపు పలుకుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం ద్వారా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద బొగ్గు బ్లాక్‌గా నిలవనున్న తాడిచెర్ల-2లో సుమారు 350 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, రాబోయే 40 నుండి 50 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తిని కొనసాగించే సామర్థ్యం ఈ బ్లాక్‌కు ఉందని ఆయన చెప్పారు. 
 
ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 2,000 శాశ్వత ఉద్యోగాలు, 5,000కు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లభిస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా, హోటళ్లు, లాడ్జీలు, రవాణా, వర్క్‌షాప్‌లు, చిన్న తరహా వ్యాపారాల వంటి అనుబంధ రంగాలలో వేలాది మందికి జీవనోపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇది ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి బలమైన పునాదిగా కూడా నిలుస్తుందని ఆయన చెప్పారు. 
 
వాహనాల రాకపోకలు, రవాణా కార్యకలాపాలు పెరగడంతో, ఆటోమొబైల్ సర్వీసింగ్, వర్క్‌షాప్‌లు,  లాజిస్టిక్స్ వంటి అనుబంధ రంగాలు కూడా వేగంగా వృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా, తడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ ద్వారా సుమారు రూ. 1.20 లక్షల కోట్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయని కేంద్ర మంత్రి అంచనా వేశారు. దక్షిణ భారతదేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అతిపెద్ద బొగ్గు బ్లాక్ అయిన తాడిచెర్ల-2ను ఆయన ‘బాహుబలి బొగ్గు బ్లాక్’గా అభివర్ణించారు. 
 
తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించడానికి అవసరమైన అన్ని అనుమతులు, క్లియరెన్స్‌లను వెంటనే పొందాలని కిషన్ రెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. రామగుండం ఏరియా-1లో సింగరేణి కార్మికుల సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి లక్షలాది కుటుంబాలకు జీవనాధారమని, తెలంగాణకే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తానికి బొగ్గును సరఫరా చేసే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని పేర్కొన్నారు. 
 
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేయడం ద్వారా దేశ విద్యుత్ ఉత్పత్తిలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే, నేడు సింగరేణి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? అది ఆర్థిక సంక్షోభంలోకి ఎందుకు కూరుకుపోయింది? అనే ప్రశ్నలను మనం నిజాయితీగా పరిశీలించాలని కోరారు. 
 
ఉత్పత్తిని పెంచే అవకాశాలు ఉన్నప్పటికీ, దానిపై కృత్రిమ ఆర్థిక భారాన్ని మోపుతున్నారని, దీనివల్ల కేవలం వడ్డీలు చెల్లించడానికి కూడా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితికి సంస్థను నెట్టివేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే సింగరేణికి చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలను నిలిపివేసిందని ఆయన గుర్తు చేశారు. ఏపీ జెన్‌కోకు సరఫరా చేసిన బొగ్గుకు సంబంధించి సింగరేణికి సుమారు రూ. 18,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. 
 
అదేవిధంగా, సుమారు రూ. 6,000 కోట్ల విద్యుత్ సరఫరా బకాయిలు కూడా చెల్లించాల్సి ఉందని, మొత్తంగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సింగరేణికి రావాల్సిన సుమారు రూ. 27,000 కోట్ల నిధులు నిలిచిపోయాయని ఆయన తెలిపారు. సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. 
 
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే నిర్లక్ష్యం ప్రదర్శించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఆయన ఆరోపించారు. దీనివల్ల, తమ కార్మికులకు జీతాలు చెల్లించడానికి కూడా సింగరేణి యాజమాన్యం బ్యాంక్ రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నించారని కేంద్ర మంత్రి ఆరోపించారు. 
 
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, మరియు ఇతర సీనియర్ నాయకులతో కలిసి కొత్తగా కేటాయించిన తాడిచెర్ల-II బొగ్గు బ్లాక్, భూపాలపల్లి ఏరియా-1లోని కెటికే-8 గని, రామగుండంలోని ఎస్ఆర్పి-3 గని, ఇతర ప్రాంతాలను సందర్శించారు. 

సింగరేణి సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు పోరాటం చేసిందని, శాసనసభలో, శాసనమండలిలో, ప్రజా ఉద్యమాల ద్వారా కార్మికుల పక్షాన బీజేపీ నిరంతరం నిలబడిందని  రామచందర్ రావు గుర్తు చేశారు. ప్రస్తుతం సింగరేణి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని పేర్కొంటూ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు చెప్పారు.
 
అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి సంస్థపై ఆర్థిక భారం మోపుతూ, సింగరేణి కార్మికులు చెమటోడ్చి సంపాదించిన సంస్థ సొమ్మును ఫుట్ బాల్ ఆటకోసం, ఇతర కార్యక్రమాలకు మళ్లించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ యాత్రలో బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు అలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, పెద్ద సంఖ్యలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్నారు