జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులన్నీ క్విడ్‌ ప్రోకోనే

జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులన్నీ క్విడ్‌ ప్రోకోనే

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్‌తో సహా పలు సంస్థలు కేవలం లాభాల కోసమే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టామని చెబుతున్నప్పటికీ, అందులో వాస్తవం లేదని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. అప్పటి ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధిని పొందిన వారే, ముడుపుల రూపేణా జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదిక సమర్పించింది.

కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్‌పేటలో 407.05 హెక్టార్ల లీజును అప్పటి ప్రభుత్వం అక్రమ పద్ధతుల్లో దాల్మియా సిమెంట్స్‌కు కట్టబెట్టిందని తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్‌ జగన్‌కు చెందిన కంపెనీలో 95 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. 1997లో జయా మినరల్స్‌ సున్నపురాయి నిక్షేపాల నిమిత్తం ప్రాస్పెక్టింగ్‌ లీజుకు దరఖాస్తు చేసింది. దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో ఆ కంపెనీ లేదన్న కారణంగానే దానిని పక్కన పెట్టారు.

అనంతరం 2004లో జయా మినరల్స్‌ను స్వాధీనానికి సజ్జల దివాకర్‌రెడ్డికి చెందిన ఈశ్వర్‌ సిమెంట్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం కూడా పాత తేదీతో చేసుకున్నట్లు ఉంది. ఒప్పందం కుదిరిన తేదీకి, స్టాంపు కొనుగోలు తేదీకి అసలు పొంతనే లేదు. తర్వాత జయా మినరల్స్‌ కోరిన లీజును తమకు బదిలీ చేయాలంటూ ఈశ్వర్‌ సిమెంట్స్‌ దరఖాస్తు చేసింది. అధికారులు 407 హెక్టార్లకు లీజు మంజూరు చేశారు. తర్వాత ఆ లీజును దాల్మియా సిమెంట్స్‌కు బదిలీ చేశారు. ఒక వ్యవహారానికి సంబంధించి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం కుట్రలో భాగమే.

ముడుపుల చెల్లింపు కింద పెట్టిన వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.146 కోట్లు దాల్మియా సిమెంట్స్‌ సంస్థకు అందలేదు. ఆ నిధులూ జగన్‌కు చేరినట్లు కీలక ఆధారం పెన్‌డ్రైవ్‌లో ఉందన్నారు. పెన్‌డ్రైవ్‌ను ఆధారంగా పరిగణిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. దాన్ని ఆధారంగా తీసుకోవడం ఎవిడెన్స్‌ చట్టం కింద చెల్లదనడం సరికాదని స్పష్టం చేశారు.  

అసలు జయా మినరల్స్, ఈశ్వర్‌ సిమెంట్స్‌ కాగితాల్లోనే ఉన్నాయని, వాస్తవంగా ఈ కంపెనీలు లేవని చెప్పారు. ఈశ్వర్‌ సిమెంట్స్‌కు చెందిన లీజును దాల్మియాకు బదలాయించడంలోనూ అక్రమాలేనని సీబీఐ న్యాయవాది వివరించారు. వాదనలను విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేశారు.