విదేశీ ప్రయాణాలపై పన్ను కథనం అవాస్తవం

విదేశీ ప్రయాణాలపై పన్ను కథనం అవాస్తవం
ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధిలో ఆంక్షల కారణంగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో, విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్‌చార్జి విధించాలని కేంద్రం యోచిస్తోందని, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వచ్చిన ఒక ఆంగ్ల మీడియా కధనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి నుండి ఈ అరుదైన ఖండన ‘ఎక్స్’  పోస్ట్ రూపంలో వచ్చింది. 
 
అందులో ఆయన ఆ పోస్ట్‌ను తిరిగి షేర్ చేస్తూ, అది “అబద్ధం” అని, అందులో సత్యం లేదని ఖండించారు. “ఇది పూర్తిగా అబద్ధం. ఇందులో రవ్వంత కూడా నిజం లేదు. విదేశీ ప్రయాణాలపై అలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదు,” అని ప్రధాని మోదీ ఆ పోస్ట్‌లో రాశారు. “మన ప్రజల కోసం ‘వ్యాపారం చేసే సౌలభ్యం’, ‘జీవన సౌలభ్యం’ మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నాము,” అని ఆయన స్పష్టం చేశారు. 

ప్రధాని స్పందన తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఆ వార్త సంస్థ క్షమాపణలు తెలిపింది. ఆ కథనం సరైనది కాదని పేర్కొంటూ దానిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్​లో పోస్ట్ చేసింది. ‘విదేశీ ప్రయాణాలపై పన్ను, సెస్‌ విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్న మా కథనం సరికాదు. ఆ కథనాన్ని ఉపసంహరించుకుంటున్నాం. జరిగిన తప్పిదానికి చింతిస్తున్నాం’ అని ఆ సంస్థ పేర్కొంది.

ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ-టీవీ18 శుక్రవారం ఈ కధనాన్ని తెలిపింది. విదేశీ ప్రయాణాలపై విధించే పన్ను/సెస్సు/సర్‌చార్జీ నేరుగా కేంద్రానికే చెందుతుందని, విభజించదగిన నిధిగా కాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయని పేర్కొన్నది. ఈ ప్రతిపాదనపై అత్యున్నత స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు వారు చెప్పారని,  విదేశీ ప్రయాణాలపై విధించే పన్ను/సెస్సు/సర్‌చార్జీ తాత్కాలికంగా ఏడాది పాటు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారని వివరించింది. 

అమెరికా-ఇరాన్‌ ఘర్షణల నేపథ్యంలో పెరిగిన ముడి చమురు ఖర్చులను తగ్గించడానికి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వారు చెప్పారని తెలిపింది. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించలేదని కూడా కథనం పేర్కొంది.