పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.3 విండ్‌ఫాల్ ట్యాక్స్

పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.3 విండ్‌ఫాల్ ట్యాక్స్

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ఎగుమతులపై లీటరుకు రూ.3 విండ్‌ఫాల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ (ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం)ను విధించింది. అదే సమయంలో డీజిల్‌, ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)పై ఉన్న సుంకాలను తగ్గించింది. ఈ మార్పులు శనివారం  నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి ప్రకటించింది.  ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, డీజిల్‌ ఎగుమతులపై విధిస్తున్న సుంకాన్ని లీటరుకు రూ.23 నుంచి రూ.16.5కు తగ్గించారు.

అలాగే ఏటీఎఫ్‌పై ఉన్న సుంకాన్ని లీటరుకు రూ.33 నుంచి రూ.16కు తగ్గించారు. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్ ఉండదని స్పష్టం చేసింది. దేశీయ వినియోగానికి విడుదల చేసే పెట్రోల్‌, డీజిల్‌పై ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్‌ సుంకాల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా పెట్రోల్‌పై లీటరుకు రూ.3 ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం (ఎస్‌ఏఈడీ) విధించినట్లు కేంద్రం వెల్లడించింది.

మార్చి 26న కేంద్ర ప్రభుత్వం డీజిల్‌పై లీటరుకు రూ.21.50, ఏటీఎఫ్‌పై రూ.29.5 ఎగుమతి సుంకం విధించింది. ఏప్రిల్‌ 11 సమీక్షలో ఈ సుంకాలను వరుసగా రూ.55.5, రూ.42కు పెంచింది. తర్వాత ఏప్రిల్‌ 30 సమీక్షలో వాటిని మళ్లీ తగ్గిస్తూ డీజిల్‌పై రూ.23, ఏటీఎఫ్‌పై రూ.33గా నిర్ణయించింది. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకే ఈ విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను విధించినట్లు కేంద్రం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ఎగుమతిదారులు అధిక లాభాలు పొందకుండా నియంత్రించడం కూడా ఈ నిర్ణయ లక్ష్యమని పేర్కొంది.

కాగా, పశ్చిమాసియా ఉద్రిక్తతలు కారణంగా పెరుగుతున్న చమురు ధరలు, బంగారం దిగుమతులతో వాణిజ్య లోటు పెరిగే అవకాశం ఉందని ఐసీఐసీఐ బ్యాంక్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ తెలిపింది.  ఏప్రిల్‌లో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 14 శాతం పెరిగి 43.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. చమురు ఎగుమతులు 35 శాతం పెరగడం, చమురుయేతర ఎగుమతులు 9 శాతం వృద్ధి చెందడం ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. 

చమురు ఎగుమతులు 9.6 బిలియన్‌ డాలర్లకు చేరి రెండేళ్లలో అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. మార్చితో పోలిస్తే ఇవి 85 శాతం పెరిగాయి. చమురుయేతర ఎగుమతులు 34 బిలియన్‌ డాలర్లుగా నమోదై నెలవారీగా స్థిరంగా ఉన్నప్పటికీ, వార్షికంగా 9 శాతం వృద్ధి చెందాయి. అమెరికాకు భారత ఎగుమతులు 1.1 శాతం పెరిగి 8.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. టారిఫ్‌ల సాధారణీకరణ ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది. 

అమెరికాయేతర దేశాలకు ఎగుమతులు 17 శాతం పెరిగి 35 బిలియన్‌ డాలర్లకు చేరాయి. చైనా, హాంకాంగ్‌, సింగపూర్‌, యూకే, జర్మనీ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనం కారణంగా పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు 28 శాతం పడిపోయాయి.