లీటరు పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలు పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరల్లో ఇంత పెద్ద మార్పు చోటుచేసుకోవడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడం, హర్మూజ్ జలసంధి మార్గంలో అంతరాయాలు ఏర్పడటం వంటి కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగుతోంది.
యుద్ధ ప్రభావం పశ్చిమాసియా దేశాలపై పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇంధన ధరల పెంపుతో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.77కు చేరుకోగా, డీజిల్ ధర రూ.90.67గా నమోదైంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.108.74, డీజిల్ రూ.95.13గా ఉండనుంది.
ముంబయిలో పెట్రోల్ ధర రూ.106.68కు చేరుకోగా, డీజిల్ రూ.93.14గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.95.25గా నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 చొప్పున పెంపు నమోదైంది. తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున ధరలు పెరిగాయి.
ఈ ధరల పెంపుతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితుల్లో ఇంధన ధరల పెంపు మరింత ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని భావిస్తున్నారు. సరుకు రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ధాన్యాలు, ఇతర అవసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 50 శాతం వరకు పెరిగినట్లు సమాచారం. ఫిబ్రవరిలో భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ సగటు ధర బ్యారెల్‌కు 69 డాలర్లుగా ఉండగా, అనంతర నెలల్లో అది 113-114 డాలర్ల వరకు పెరిగింది. ఈ పరిస్థితుల్లో చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరగడంతో ధరల పెంపు తప్పనిసరి అయిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపారు.

More Stories
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదేమో!
ఖరీఫ్ పంటల మద్దతు ధరలకు రూ.2.6 లక్షల కోట్లు
భగ్గుమంటున్న ఇంధనం ధరలు.. ఎయిరిండియా విమానాల కుదింపు