సరిహద్దు రేఖ వద్ద లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం

భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన లష్కరే తొయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి ఆ ఉగ్రముఠా కీలక నేతల్లో ఒకరు మృత్యువును తప్పించుకోలేకపోయాడు. జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు రేఖ (ఎల్‌ఓసీ) గుండా దేశంలో అడుగుపెట్టాలనుకున్న ఈ ముష్కర మూకలోని నలుగురు ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోజిక్ డివైజ్‌ (ఐఈడీ) పేలుడులో హతమయ్యారు. 

సోమవారం సంభవించిన ఈ పేలుడులో లష్కరే ప్రధాన నాయకుడు మొహమ్మద్ ఫైజాన్ సహా నలుగురు మరణించారు. ఎల్‌ఓసీ దరిదాపుల్లో చొరబాట్లను నివారించేందుకు ఏర్పాటు చేసిన మైన్స్‌ ఉగ్ర కుట్రకు చరమగీతం పాడాయి. సరిహద్దు రేఖ వెంబడి అక్రమంగా భారత్‌లో ప్రవేశించి ఉగ్రదాడులకు పాల్పడాలనుకున్న లష్కరే తొయిబాకు చెందిన ఒక బృందం కథ ముగిసింది. 

పాకిస్తానీ సైనికులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలన్నీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజీలో, సాంప్రదాయ ‘పఠానీ’ దుస్తులు ధరించిన పలువురు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తున్నట్లు సమాచారం. వారు పిస్టల్స్ పట్టుకుని, అటవీ ప్రాంతంలో ఐఈడీని అమర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక వివరాల ప్రకారం, నలుగురి నుండి ఆరుగురు అనుమానితులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు నిర్ధారించబడింది.

సుమారు ఉదయం 4:30 గంటలకు, ఉగ్రవాదులు పాకిస్థాన్ వైపు నుండి నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొరబడటానికి ప్రయత్నించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఉగ్రవాదులు భారత సరిహద్దు సమీపంలో ఐఈడీని అమర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో, వారు భారత సైన్యం చొరబాటు నిరోధక వ్యవస్థను ఎదుర్కొన్నారు.  

జమ్ముకశ్మీర్‌ పూంచ్ జిల్లా ఎల్‌ఓసీకి సమీపంలోని నంగి టెక్రీకి దగ్గర్లోని కృష్ణ ఘాటి సెక్టార్‌ గుండా నలుగురు సభ్యులతో కూడిన లష్కరే ముఠా భారత్‌లోకి చొరబడాలనుకుంది. కానీ, అనూహ్యంగా మందుపాతర పేలుడు ధాటికి ఆ రాక్షస బృందం తునాతునకలైంది. చొరబాటుదారులను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన మైన్స్ పేలడంతో ఫైజాన్, వకాస్, అసిమ్, ఇష్తియాక్ అనే లష్కరే ఉగ్రవాదాలు మరణించారు.

భారత భూభాగం వైపు ఉన్న ఈ ప్రాంతం ‘కృష్ణ ఘాటి’ సెక్టార్ పరిధిలోకి వస్తుందని చెబుతుండగా, అనుమానిత కదలికలు పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని హజీరా సమీపంలో ఉన్న ‘బదర్ పూర్’ ప్రాంతానికి సంబంధించినవిగా గుర్తించారు. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన ’66 ఫ్రాంటియర్ ఫోర్స్’ మోహరించి ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. పాకిస్థాన్ సైన్యం సహకారం లేదా రక్షణతో భారత భూభాగం వైపు ఐఈడిని అమర్చడానికి ఆ ఉగ్రవాదులు ప్రయత్నించారు.

ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదులపై నిరంతరం ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలు ప్రతి కదలికపై నిశితంగా గమనిస్తూ, అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి.  

About The Author