ఎంత గింజుకున్నా లడఖ్ భారత్‌లో అంతర్భాగమే

లడఖ్‌ భారతదేశంలో అంతర్భాగమని, దాని విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా నిరాకరించినంత మాత్రాన అది వాస్తవం కాకుండా పోద‌ని తేల్చిచెప్పింది. లడఖ్‌లోని కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలకు భారత్‌ అధికారికంగా పేర్లు పెట్టడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు స్పందించింది.

భారత సర్వే శాఖ అధికారిక మ్యాప్‌లో లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంలోని 28 ప్రదేశాలు, భౌగోళిక లక్షణాలకు ప్రామాణిక పేర్లను గుర్తించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. లడఖ్‌ పాలన యంత్రాంగం, స్థానిక భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. ఆయా ప్రాంతాలను అధికారిక మ్యాప్‌లో స్పష్టంగా గుర్తించడం వల్ల వాటిని కచ్చితంగా గుర్తించడంతోపాటు ప్రజల్లో అవగాహన పెరుగుతుందని పేర్కొంది.

అక్టోబర్‌ 2న భారత్‌ లడఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలు, భౌగోళిక లక్షణాలకు అధికారిక మ్యాప్‌లో గుర్తింపు కల్పించింది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి గతంలో భారత్‌–చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న గోగ్రా, హాట్‌ స్ప్రింగ్స్‌ వంటి ప్రాంతాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 

ది గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం, భారతదేశం తీసుకున్న చర్య చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మంగళవారం భారత భూభాగంపై హక్కులు ప్రకటించారు. “భారతదేశం ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన ‘లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం’ అని పిలవబడే దానిని చైనా ఎన్నడూ గుర్తించలేదు” అని చెప్పుకొచ్చారు. 

“భారతదేశం ప్రకటించిన ప్రామాణిక పేర్లను కూడా చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ చర్య చట్టవిరుద్ధం, చెల్లదు. చైనా-భారత సరిహద్దులోని పశ్చిమ భాగంలో ఉన్న సంబంధిత ప్రాంతాలు ఎల్లప్పుడూ చైనాకే చెందినవన్న వాస్తవాన్ని ఇది మార్చలేదు,” అని గ్లోబల్ టైమ్స్ ఉటంకించినట్లుగా మావో పేర్కొన్నారు. 

అయితే, తన ప్రాదేశిక సమగ్రతపై భారతదేశం తీసుకున్న దృఢమైన, స్థిరమైన వైఖరి ముందు బీజింగ్ ఈ నిస్సహాయ వాదనలు ఏమాత్రం నిలబడవు. భారతదేశం ఇటువంటి రాజకీయ ప్రేరేపిత వాదనలన్నింటినీ తిరస్కరించింది. ఈ ప్రాంతంపై తన ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని పదేపదే ప్రకటిస్తూ, “జమ్మూ & కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం భారతదేశంలో అంతర్భాగం, విడదీయరానివి. రాజకీయ ప్రేరేపిత ప్రచారాన్ని ఎంతగా పునరావృతం చేసినా ఈ వాస్తవాన్ని మార్చలేరు,” అని తేల్చి చెప్పింది.

సరిహద్దు ప్రాంతాల భౌగోళిక వివరాలను మరింత స్పష్టంగా నమోదు చేయడం, అధికారిక పటాల్లో ప్రామాణికతను పెంచడం, ప్రజలకు ఆయా ప్రాంతాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది.  

About The Author