భారత సైన్యంకు అందిన 450 `సూసైడ్ డ్రోన్లు’  నాగాస్త్ర-1 ఆర్ 

భారత ఆర్మీకి మరింత బలం చేకూరనుంది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (ఎస్‌డీఏఎల్‌) అనే సంస్థ 450 డ్రోన్లను తయారు చేసి, ఇండియన్ ఆర్మీకి అందించింది. ఇవి నాగాస్త్ర-1ఆర్ పేరుగల కమికాజి డ్రోన్లు. అంటే, ఇవి సూసైడ్ డ్రోన్లు. ఇవి దగ్గర్లోని లక్ష్యాలపై దాడి చేసేందుకు ఉపయోగపడతాయి. వీటిని తయారు చేసిన ఎస్‌డీఏఎల్‌.. సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా సబ్సిడరీ సంస్థ.

ఇలా ఒక సంస్థ ఒకేసారి, ఇంత పెద్ద మొత్తంలో ఇండియన్ ఆర్మీకి డ్రోన్లు అందించడం ఇదే మొదటిసారి. అత్యవసర కొనుగోలులో భాగంగా ఇండియన్ ఆర్మీ వీటిని తయారు చేయించుకుంది. గత ఏడాది మార్చిలో ఇండియన్ ఆర్మీ వివిధ సంస్థల్ని ఈ డ్రోన్ల తయారీకి ఆహ్వానించింది. కానీ, ఎస్‌డీఏఎల్‌ సంస్త మాత్రమే నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో టెండర్ దక్కించుకుంది.  

గత ఏడాది పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల అనంతరం సాయుధ దళాలకు కల్పించిన అత్యవసర సేకరణ అధికారాల కింద, రూ. 158 కోట్ల విలువైన ఈ ఆర్డర్‌ను గత ఏడాది జూన్‌లో ఇచ్చారు. నాగాస్త్ర-1ఆర్ ను సైన్యం నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. స్వల్ప-శ్రేణి కార్యకలాపాల సమయంలో దీనిని ‘కామికాజే’ (ఆత్మాహుతి) దాడుల కోసం ఉపయోగించవచ్చు. అలాగే, గాలిలో ఉన్నప్పుడే మిషన్‌ను విరమించుకుని, డ్రోన్‌ను సురక్షితంగా తిరిగి పొందే సామర్థ్యం కూడా దీనికి ఉంది.

ఇవి తక్కువ దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగలవు. అంతేకాదు. మధ్యలోనే అవసరమైతే తిరిగి వెనక్కి రాగలవు. అందులోనూ డ్రోన్లను సురక్షితంగా ల్యాండ్ చేయగలవు. సాధారణంగా ఒకసారి డ్రోన్లు ప్రయోగించిన తర్వాత వాటిని మధ్యలో నిలువరించడం కష్టం. వాటిని ఆపాలంటే పేల్చేయాల్సిందే. 

కానీ, ఇవి తమ ప్రయాణం మధ్యలో వెనక్కుతిరిగి రాగలవు. ప్రస్తుతం అనేక దేశాలు నిరంతరం యుద్ధం చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆయుధాల కొనుగోలు ఆర్థిక భారంగా మారింది. అందుకే, దేశీయంగా ఇలాంటివి తయారు చేయడం వల్ల తక్కువ ఖర్చుతోనే ఆయుధాల్ని తయారు చేసుకోగలుగుతున్నాం. ఇక, ఎస్‌డీఏఎల్‌ సంస్థ మరిన్ని ఆధునిక ఆయుధాలు తయారు చేసేందుకు సిద్ధమవుతోంది.

About The Author