*27 ఆగస్టు 1947న రజాకారుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 118 మంది అమరవీరులు
వీరబైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 1947 ఆగస్టు 27న రజాకారుల దాడిలో వీరబైరాన్‌పల్లిలో 118 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
నిజాం, రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని తెలిపారు. రజాకారుల దమనకాండకు వ్యతిరేకంగా రెండు దఫాలుగా దాడులను ఎదుర్కొని వీరబైరాన్‌పల్లి ప్రజలు, అమరవీరులు చూపిన ధైర్యసాహసాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని చెప్పారు. తెలంగాణ ప్రజలపై సాగిన దమనకాండకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వీరబైరాన్‌పల్లి ఘట్టం విషాదకరమైనదైనా, ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు.
వీరబైరాన్‌పల్లి పోరాట ఘట్టంతో పాటు తెలంగాణ విమోచన పోరాటంలోని చారిత్రక సంఘటనలను నేటి, భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్, గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ విమోచన పోరాట చరిత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి విమర్శించారు.
ఎంఐఎంకు భయపడి, ఓట్ల కోసం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ తెలంగాణ ప్రజల గొప్ప పోరాట చరిత్రను మరుగునపరిచారని ఆరోపించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని శ్రీ వర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం, చరిత్ర గురించి మాట్లాడిన గత పాలకులు అధికారంలో ఉన్న సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేందుకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అమరవీరుల త్యాగాలు, తెలంగాణ విమోచన పోరాట చరిత్రను ప్రజలకు విస్తృతంగా తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ తెలంగాణ విమోచన పోరాట చరిత్రను వాస్తవాలతో ప్రజలకు తెలియజేయడం కోసం బీజేపీ అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తోందని చెప్పారు. అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు.
కమిటీ సభ్యులు కాపర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన పోరాట చరిత్రను వాస్తవాలు, చారిత్రక ఆధారాలతో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల పాత్రను కూడా చారిత్రక ఆధారాలతో ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను కలిసి వారిని సన్మానించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు.

More Stories
తుమ్మిడిహెట్టి ఆనకట్టపై 1న కేంద్ర జల సంఘం భేటీ
ఎస్ఐఆర్ ప్రక్రియలో నకిలీ వివరాలు ఇస్తే జైలు శిక్ష
సృజనోత్సవ్లో స్విస్ ప్రభంజనం.. భాషా సాంస్కృతిక శాఖ సత్కారం