గత కొంతకాలంగా భూ యజమానులను కలవరపెడుతున్న ‘సెక్షన్ 22ఏ’ నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక హై-లెవల్ కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బాధితుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, దరఖాస్తులను పరిశీలించి సత్వర పరిష్కారం అందించేందుకు సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కూడిన హై-లెవల్ కమిటీని ప్రభుత్వం నియమించింది.
ఈ కమిటీ రాబోయే 30 రోజుల్లోగా అర్హులైన భూ యజమానుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించనుంది. అవసరమైతే చట్ట సవరణలు చేసి, జిల్లాల వారీగా అడ్డంకులను తొలగించి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం ప్రణాళిక చేయనుంది. భారత రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22ఏ ప్రకారం.. ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాలు, ప్రభుత్వ ఆస్తులు, మరియు రక్షణ అవసరాలకు సంబంధించిన కొన్ని కీలక ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడానికి అధికారం ఉంటుంది.
దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ శాఖ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ ను నిర్వహిస్తుంది. అయితే సాధారణంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ శాఖకు చెందిన, లేదా వక్ఫ్ ఆస్తులు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు ఈ జాబితాలో ఉంటాయి. ఈ జాబితాలో ఉన్న సర్వే నంబర్లకు సంబంధించిన భూముల అమ్మకాలు, కొనుగోళ్ళు సాధ్యం కావు. రికార్డుల డిజిటలైజేషన్, పాత డేటా నమోదులో జరిగిన కొన్ని సాంకేతిక లోపాల వల్ల చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తులు కూడా పొరపాటున ఈ నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి.
ఒకే సర్వే నంబర్‌లో కొంత ప్రభుత్వ భూమి ఉండి, మిగతాది ప్రైవేట్ వ్యక్తులదైనా సరే మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో ట్యాగ్ చేయడంతో అసలు యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ భూములను అమ్ముకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక యజమానులు సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది.

More Stories
8 మంది బంగ్లాదేశీయులకు ఎన్ఐఏ కోర్టలో జీవిత ఖైదు
గ్రాడ్యుయేట్ ఎమ్యెల్సీ ఓట్ల నమోదు ప్రకియ ప్రారంభం
స్వతంత్ర భారత చరిత్రలో హైదరాబాద్ సంస్థానం విమోచన ఓ కీలక ఘట్టం