గ్రాడ్యుయేట్ ఎమ్యెల్సీ ఓట్ల నమోదు ప్రకియ ప్రారంభం 

గ్రాడ్యుయేట్ ఎమ్యెల్సీ ఓట్ల నమోదు ప్రకియ ప్రారంభం 
 
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదలైంది. మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఎంఎల్‌సి నియోజకవర్గాల ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం ఈ నెల 28వ తేదీన ఎన్నికల కమిషన్ పబ్లిక్ నోటీసు ఇవ్వనుంది. ఆ రోజు నుంచే ఫారం -18(కొత్త ఓటరు) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది.
 
నవంబరు 6 వరకు ఓటరు దరఖాస్తులు స్వీకరించి, నవంబరు 25న ముసాయిదా ఓటరు  జాబితా విడుదల చేయనున్నారు. నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు అభ్యంతరాలు స్వీకరించి, డిసెంబరు 30న పట్టభద్రుల తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.  గత జాబితాలో ఓటున్న పట్టభద్రులు కూడా మళ్లీ కొత్తగా ఫారం 8 సమర్పించాల్సిందేనని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా పోస్టుద్వారా అర్హత ధ్రువీకరణపత్రాలు జతపరిచి ఫారం 8 సమర్పించాలని సీఈవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
 
ఎంఎల్‌సిలు సురభి వాణిదేవి, తీన్మార్ మల్లన్న పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుండటంతో ఆ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కొత్తగా ఓటర్ల జాబితా తయారు చేయనున్నారు.  ఎన్నికల ప్రక్రియకు ముందే గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు తదితర ప్రక్రియలు మొదలు కావాల్సి ఉంటుంది. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల జాబితా సవరణకు నవంబర్ 1 అర్హత తేదీగా ఎన్నికల సంఘం నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 
 
2023 డిసెంబర్‌లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, ఈ ఎన్నికలు ప్రభుత్వ పాలనపై విద్యావంతుల అభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎన్నికలుగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు, విద్య, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ నియామకాలు, యువతకు సంబంధించినటువంటి అంశాలు గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి ప్రతిష్టాకరంగా తీసుకొని ఈ ఎన్నికల్లో విజయంకోసం సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించాయి.