స్వతంత్ర భారత చరిత్రలో ఒక కీలక ఘట్టానికి హైదరాబాద్ విమోచనం ముగింపు పలికిందని ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ గుర్తు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ 1948 సెప్టెంబరు నాటి పరిణామాలు, ‘ఆపరేషన్ పోలో’ అనంతరం ఈ సంస్థానం భారత రాష్ట్రాల సమాఖ్యలో విలీనం కావడాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నేటి వేడుక ఒక చారిత్రక తేదీ సంస్మరణకు మాత్రమే పరిమితం కాబోదని పేర్కొన్నారు.
ఇది భారత ప్రగతి ప్రస్థానాన్ని, దేశ సమైక్యతను సమున్నతంగా నిలిపే విలువలను గుర్తుచేసే సందర్భమని ఆయన అభివర్ణించారు. విభిన్న రాజకీయ పరిస్థితుల నడుమ ఎన్నో సంఘర్షణలకు గురైన ప్రజలను ఏకతాటిపైకి తేవడంలో ఒక నవ స్వతంత్ర దేశం ఎదుర్కొన్న అసంఖ్యాక సవాళ్లను హైదరాబాద్ చరిత్ర ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.
ఈ పరిణామాన్ని రాజనీతిజ్ఞత, ధైర్యం, త్యాగాల గాథగా పేర్కొంటూ- ప్రతి పౌరుడికీ సమాన స్థాయినిచ్చే రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య సౌధం నిర్మించే దిశగా నిరంతర, బృహత్తర ప్రక్రియ కొనసాగిందని గుర్తుచేశారు. జాతీయ సమగ్రత దిశగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అవిరళ కృషిని ప్రస్తావిస్తూ- విభజన విషాదం నుంచి దేశం కోలుకుంటున్న వేళ భారత తొలి హోంశాఖ మంత్రిగా ఆయన అసాధారణ కర్తవ్య నిర్వహణ సదా స్మరణీయమని చెప్పారు.
వందలాది సంస్థానాలను ఒకే సమాఖ్యగా రూపొందించడంలో సంస్థానాల శాఖ మంత్రిగానూ తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారని ఉపరాష్ట్రపతి చెప్పారు. “ఈ సంస్థాన విమోచనం ద్వారా బలమైన, ఏకీకృత సమైక్య భారతానికి సర్దార్ పటేల్ దృఢమైన పునాది వేశారు” రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు.
దేశ పురోగమనంలో వివిధ దశలను పోలుస్తూ- “స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారు. అటుపైన ఆధునిక భారతంతో సంస్థానాల ఏకీకరణకు సర్దార్ పటేల్ ఎనలేని కృషి చేశారు. తదుపరి తరంలో నేడు ‘వికసిత భారత్-2047’ దిశగా ప్రస్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ సారథ్యం వహిస్తున్నారు” అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
హైదరాబాద్ విమోచన నేపథ్యంలో సాగిన ప్రజా ఉద్యమాన్ని కొనియాడుతూ ఆనాడు విద్యార్థులు, మేధావులు, రచయితలు, సామాజిక-రాజకీయ కార్యకర్తలు, రైతులు సహా సామాన్య పౌరులు కూడా ఈ పోరాటంలో భాగస్వాములయ్యారని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అనేకమంది కఠిన కారాగార వాసం, హింస, అంతులేని వ్యక్తిగత కష్టనష్టాలకు గురయ్యారని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా రామ్‌జీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమురం భీమ్ వంటి దేశభక్తులకు నివాళి అర్పించారు. ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రసిద్ధ రాజనీతిజ్ఞుల ద్వారా మాత్రమే చరిత్రకు రూపం ఏర్పడదని పేర్కొంటూ అన్యాయాన్ని విధి లిఖితంగా అంగీకరించని సామాన్యుల ధైర్యసాహసాలు కూడా చరిత్రను సృష్టించగలవని స్పష్టం చేశారు.
ఈ మేరకు “రాజకీయ ఏకీకరణ భూభాగాలను ఏకం చేయగలదు.. అయితే, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం పౌరులందర్నీ ఏకతాటిపైకి తెస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం భౌగోళిక సరిహద్దులతో జాతీయ ఐక్యత సాధ్యం కాదంటూ సమాన హక్కులు, గౌరవం, అవకాశాల ద్వారా దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని రాధాకృష్ణన్ ప్రస్ఫుటం చేశారు.
దేశ ఐక్యత కోసం ప్రతి పౌరులందరూ ఒకే రీతిలో ఉండాల్సిన అవసరం లేదని తెలుపుతూ భిన్న భాషలు.. విభిన్న సంప్రదాయాలు, విశ్వాసాలు గలవారై ఉండవచ్చునని చెప్పారు. అలాగే, భిన్న రాజకీయ అభిప్రాయాల గలవారు కావచ్చునని, అంతిమంగా రాజ్యాంగం, సార్వభౌమాధికారం ప్రజలకే చెందుతాయనే వాస్తవమే వారిని ఏకతాటిపై నిలుపుతుందని స్పష్టం చేశారు.
కేంద్ర సాయుధ పోలీసు బలగాల పాత్రను ప్రస్తావిస్తూ సంస్థానాల ఏకీకరణ సందర్భంగా 1947-48లోనే కాకుండా భారత ప్రాదేశిక సమగ్రత పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషించారని ఉపరాష్ట్రపతి కొనియాడారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రవాదాన్ని రూపమాపడంలో వారి త్యాగాలను కూడా ఆయన కొనియాడారు.
ఏకీకరణ సార్వజనీనతకు బాటలు వేయాలని, దేశ సేవలోనే అంతిమంగా దేశభక్తి అత్యున్నత రూపం కనిపించేలా హైదరాబాద్ వారసత్వం గుర్తుచేస్తుందని ఉపరాష్ట్రపతి చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విమోచన, ఏకీకరణకు దోహదపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, వారి త్యాగాలకు, ధైర్యసాహసాలకు ఉపరాష్ట్రపతి గౌరవపూర్వక నివాళి అర్పించారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కవాతులో సాయుధ దళాల గౌరవ వందనాన్ని ఉపరాష్ట్రపతి స్వీకరించారు. అద్భుత క్రమశిక్షణతో సాగిన కవాతు సహా భావోద్వేగభరిత సాంస్కృతిక ప్రదర్శనలను ఆయన వీక్షించారు. దేశ ప్రగతి ప్రస్థానంలోని ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వాములైన వారి ధైర్యసాహసాలకు, దృఢ సంకల్పానికి నివాళిగా హైదరాబాద్ విమోచన, ఏకీకరణ సమయంలో ప్రజల పోరాటం, శౌర్యం, త్యాగాలను ఈ సాంస్కృతిక ప్రదర్శనలు కళ్లకు కట్టాయి.
హైదరాబాద్ 79వ విమోచన దినోత్సవంలో పాలుపంచుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛాన్నుంచి, వీరయోధులకు నివాళి అర్పించారు. అలాగే, హైదరాబాద్ విమోచన, రాష్ట్రాల సమాఖ్యలో ఏకీకరణకు సాగిన పోరాటం, త్యాగాలు, చారిత్రక ప్రస్థానాన్ని వివరిస్తూ సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్’ ఏర్పాటు చేసిన ప్రదర్శనను కూడా ఆయన తిలకించారు.

More Stories
రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
అమెరికా క్రైస్తవ బృందం సీబీఐ ఎఫ్సిఆర్ఎ ఉల్లంఘనలపై కేసు
మోదీ దూరదృష్టితో అద్భుత మార్పు సాధిస్తున్న భారత్