8 మంది బంగ్లాదేశీయులకు ఎన్ఐఏ కోర్టలో  జీవిత ఖైదు 

8 మంది బంగ్లాదేశీయులకు ఎన్ఐఏ కోర్టలో  జీవిత ఖైదు 
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మానవ అక్రమ రవాణా కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2019లో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. శిక్ష పడిన వారిలో 8 మంది బంగ్లాదేశ్‌కు చెందిన పౌరులు ఉన్నారు. 

బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్ లో పనులు చేసుకోవడం మాత్రమే కాకుండా ఇక్కడ ఉపాధి ఆశ చూపి అమాయక మహిళలను బంగ్లా నుంచి అక్రమ రవాణా చేసి, తీరా వచ్చాక వారిని వ్యభిచారంలోకి దించుతున్నారు. దేశం కాని దేశంలో ఎవరూ తెలియని చోట ఎంతో మంది మహిళలు దిక్కు తోచని స్థితిలో వ్యభిచార కూపంలో ఇరుక్కుపోతున్నారు. 2019లో జరిగిన ఇలాంటి ఘటనలో హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కోర్టు 8 మంది బంగ్లాదేశీయులతోపాటు మరొకరిని దోషులుగా తేల్చి
జీవిత ఖైదు విధించింది.
వీరిపై రూ.1.37 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం ఆ డబ్బులు కట్టకపోతే మరో 3 నెలల సాధారణ జైలు శిక్షను విధించాలని ఆదేశించింది. 2019 సెప్టెంబర్‌లో హైదరాబాద్ శివార్లోని జల్‌పల్లి వ్యభిచారం చేస్తుండగా ముగ్గురు బంగ్లాదేశీ మహిళలను రక్షించిన హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్ బాలాపూర్‌ని మహిమూద్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి మరో మహిళను కాపాడి నిందితులపై కేసు నమోదు చేశారు. 
 
ఇది రెండు దేశాల మధ్య జరిగిన వ్యవస్థీకృత నేరం కావడం, దేశభద్రత కోణం ఉండటంతోపాటు దీని వెనుక ఉన్న పెద్ద ముఠాల గుట్టు విప్పే ఉద్దేశంతో 2019 అక్టోబర్ 12న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసును తన పరిధిలోకి తీసుకొని మళ్లీ కేసును రిజిస్టర్ చేసింది. మానవ అక్రమ రవాణా కేసులను కూడా ఎన్ఐఏ విచారించేలా 2019 జులైలో భారత పార్లమెంట్ ఎన్ఐఏ చట్టానికి సవరణ చేసింది. 
 
దీంతో దేశంలో ఎన్ఐఏ నమోదు చేసిన తొలి మానవ అక్రమ రవాణా కేసుగా ఇది గుర్తింపు పొందింది. ఈ కేసును లోతుగా విచారించిన ఎన్ఐఏ.. 2020 అక్టోబర్ 17న 12 మందిపై ఛార్జిషీట్ నమోదు చేసింది. వీరిలో ఏ1, ఏ3, ఏ7 పరారీలో ఉన్నారు. 
 
దర్యాప్తులో భాగంగా 2019, 2020 మధ్య రుహుల్ అమిన్ ధాలి (ఏ2), మహమ్మద్ యూసుఫ్ ఖాన్ అలియాస్ ఎండీ ఇమ్రాన్ (ఏ4), బితి బేగం అలియాస్ ఖదిజా షేక్ (ఏ5), ఇమాముల్ ఘాజీ అలియాస్ మహ్మద్ రాణా హుస్సేన్ (ఏ6), మహ్మద్ అల్ మమున్ (ఏ8), సోజిబ్ షేక్ (ఏ9), సురేశ్ కుమార్ అలియాస్ సాగర్ (ఏ10), మహమ్మద్ అబ్దుల్లా మున్షీ అలియాస్ అబ్దుల్ సర్కార్ (ఏ11), మొహమ్మద్ ఆయుబ్ షేక్ (ఏ12)లను తెలంగాణతోపాటు బెంగాల్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు.