ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దానం నాగేందర్‌పై అసెంబ్లీ స్పీకర్ అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ ఇచ్చిన నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచే ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆగస్టు 21న తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బీ-ఫామ్‌పై పోటీ చేశారు.
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, వివేక్‌రెడ్డి హైకోర్టుకు తెలియజేస్తూ పార్టీ ఫిరాయింపులకు ఇంతకంటే వేరే ఆధారాలు అవసరం లేదని అతడిపై వేటు వేయాలని స్పష్టం చేశారు.
ఈ కేసులో హైకోర్టు తాజా తీర్పులో కీలక అంశాన్ని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడిగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. అంటే 2024లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సమయం 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వర్తించనుంది.
దానం నాగేందర్ అనర్హత కేసులో హైకోర్టు తీర్పు అనంతరం ఆయన తరఫు న్యాయవాదులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. తీర్పు అమలుపై స్టే విధించాలని.. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేను ఇప్పటికిప్పుడు పదవి నుంచి తొలగిస్తే నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని దానం తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తీర్పుపై తాత్కాలికంగా స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు చేసిన స్టే అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం విషయంలో తదుపరి రాజ్యాంగ, ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. హైకోర్టు తీర్పు కాపీలను సంబంధిత రాజ్యాంగ సంస్థలకు పంపించే ప్రక్రియ ఉండనుంది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More Stories
22 ఏ భూముల సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ
8 మంది బంగ్లాదేశీయులకు ఎన్ఐఏ కోర్టలో జీవిత ఖైదు
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ప్రతిపాదనలు పునఃపరిశీలించండి