* హౌస్ అరెస్టుపై రాంచందర్ రావు ఆగ్రహం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా మైండ్‌సెట్‌తో ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తోందని, సమస్యలపై గళమెత్తే ప్రతిపక్షాలు, విద్యార్థులపై పోలీసు నిర్బంధాలను ప్రయోగిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను చేపట్టిన నిరాహార దీక్షా శిబిరానికి స్వయంగా వచ్చి తమ సమస్యలు చెప్పుకున్న రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు, వారికి మద్దతు తెలిపేందుకు బయల్దేరిన ఆయనను తార్నాకలోని నివాసంలో పోలీసులు ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు.
ఒకవైపు లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుండా ఆగం చేస్తుంటే, మరోవైపు ఆయుష్ విద్యార్థులకు, జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్లు సక్రమంగా ఇవ్వట్లేదని విమర్శించారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పీజీ విద్యార్థులకు నెలకు రూ. 26 వేలు, సూపర్ స్పెషాలిటీ వారికి రూ. 30 వేల వరకు స్టైఫండ్లు ఇస్తుంటే, తెలంగాణలో మాత్రం అందులో సగం కూడా ఇవ్వకుండా కేవలం రూ. 13 వేల నుంచి రూ. 15 వేలకే పరిమితం చేసి విద్యార్థుల పొట్టకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును జీవో 97 ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శక్తి స్కీమ్’ పేరుతో వింత ప్రయోగాలు చేస్తూ, సాంకేతిక విద్యను కేవలం నామమాత్రపు స్కిల్ డెవలప్‌మెంట్‌గా మార్చి, పాలిటెక్నిక్ విద్యార్థుల చదువును అవమానపరుస్తున్నారని విమర్శించారు.

More Stories
రాజీనామాకు సురేఖ ససేమీరా… భర్తరఫ్ చేస్తే తిరుగుబాటు!
’భూ భారతి’ మంత్రులకు వజ్రాల హారతి
తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు.. బిజెపి 7 డిమాండ్లు