ఉమ్మడి జలశయాల్లోని నీటి విడుదలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటికి మాత్రమే పరిమితం కావాలని నిర్ణయించారు. ఏడాది వరకు రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై వచ్చే నెల నాలుగో తేదీన మరోమారు భేటీ అయి చర్చించనున్నారు. వాటాలు, నీటి వినియోగం, విద్యుత్ ఉత్పత్తిపై సమగ్ర ప్రతిపాదనలతో రావాలని రెండు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి సూచించారు.
హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం సుధీర్ఘంగా వాడివేడిగా సాగింది. కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి సతీష్ కాంబోజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున్ సాగర్‌లో అందుబాటులో ఉన్న నీరు రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించారు. గతంలో కొనసాగిన ఒప్పందం ప్రకారం 66, 34 నిష్పత్తిలో నీరివ్వాలని ఏపీ కోరింది. తాగునీటి అవసరాలు అయినందున వాటాలతో సంబంధం లేకుండా చెరిసగం నీరివ్వాలని తెలంగాణ ప్రతిపాదించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బోర్డుకు సమర్పించిన నీటి అవసరాల ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. తాగునీటి కోసం అక్టోబర్ నెలాఖరు వరకు తమకు 47 టీఎంసీల నీరు ఇవ్వాలని ఏపీ కోరింది. 2027 ఆగస్టు వరకు తమకు తాగునీటి అవసరాల కోసం 50 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరింది. తెలంగాణలోని కృష్ణా బేసిన్ ఉన్న హైదరాబాద్ సహా జిల్లాల్లోని రెండు కోట్ల మంది తాగునీటి కోసం వచ్చే ఆగస్టు వరకు 50 టీఎంసీలు అడిగితే అంతకంటె చాలా తక్కువ మంది ఉన్న ప్రాంతానికి అక్టోబర్ వరకే 47 టీఎంసీలు ఎలా అడుగుతారని తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యకం చేశారు.
ఆ నీరంతా ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. మార్గమధ్యలో తమకు చాలా జలశయాలు, చెరువులు ఉన్నాయని, వాటిని నింపుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ ఈఎన్సీ తెలిపారు. అటు తెలంగాణ శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీరు వదులుతోందని ఏపీ అభ్యంతరం తెలిపింది. నాగార్జున సాగర్‌పై ఆధారపడి తాగునీటి అవసరాలు ఉన్నాయని శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా సాగర్ లోకి నీరు వెళ్తోందని తెలంగాణ ఈఎన్సీ తెలిపారు.
అయనా ఏపీ కూడా విద్యుత్ ఉత్పత్తి చేసి మరో బేసిన్ కు తరలిస్తోందని అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇప్పటికే ఎక్కువ నీటిని తీసుకెళ్తున్నారని, 19 టీఎంసీలకు మించి తీసుకెళ్లడానికి వీల్లేదని తెలంగాణ ఈఎన్సీ పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి తాము ప్రతిపాదించిన 22 టీఎంసీలు ఇస్తే సరిపోతుందని ఏపీ ఈఎన్సీ చెప్పారు. రెండు రాష్ట్రాలు భిన్నమైన వాదనలు వినిపించిన నేపథ్యంలో వచ్చే నెల నాలుగో తేదీన మరోమారు త్రిసభ్య కమిటీ సమావేశమై తాగునీటి అవసరాలపై చర్చించాలని నిర్ణయించారు.
More Stories
ఫీజుల బకాయిల చెల్లింపుకై బిజెపి రెండు రోజుల దీక్ష
అల్పపీడనంతో తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు
నిర్ణయాత్మక దశకు మావోయిజంపై సైద్ధాంతిక పోరాటం