తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ఆందోళనకు దిగారు. ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన 48 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆగస్టు 24 ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష ఆగస్టు 25 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
రాష్ట్రంలోని విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా అనుమతి నిరాకరించినప్పటికీ వెనక్కి తగ్గకుండా, విద్యార్థుల పక్షాన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే దీక్షా శిబిరంలో కూర్చున్నారు.
ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక, ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాలు కోల్పోతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిన పాలకుల తీరుపై రాజీలేని పోరాటం చేస్తూ, తెలంగాణవ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకానికి బీజేపీ పూర్తి భరోసా కల్పిస్తోంది. ఫీజు బకాయిల సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ పోరాటం ఆగదని పార్టీ స్పష్టం చేసింది.
యువత గురించి మాట్లాడేందుకు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లేందుకు సమయం ఉన్న కాంగ్రెస్‌కు చెందిన ఓ స్వయంప్రకటిత “యువ నాయకుడికి”.. చదువు కొనసాగించడానికే ఇబ్బందులు పడుతున్న తెలంగాణ విద్యార్థుల వద్దకు వచ్చి వారికి అండగా నిలబడేందుకు మాత్రం సమయం లేదని బిజెపి ఎంపీ రేఖ శర్మ ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించినప్పుడు పరిస్థితులు మెరుగుపడతాయని ఆశించారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటికి సుమారు రూ. 6,000 కోట్లుగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇప్పుడు దాదాపు రూ. 12,000 కోట్లకు పెరిగాయని ఆమె ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇంత భారీ మొత్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎందుకు విడుదల చేయలేకపోతోంది? అని ఆమె ప్రశ్నించారు.
“శాంతియుతంగా దీక్ష చేపడతామంటే కనీసం అనుమతి కూడా ఇవ్వని నిరంకుశ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా, మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను నిలువునా మోసం చేసింది. మధ్యాహ్న భోజన పథకానికి సైతం సక్రమంగా నిధులు కేటాయించడం లేదు” అని శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం సుమారు 8 శాతం మాత్రమే కేటాయించడం విద్యపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలిపారు. రాష్ట్రంలోని 30 వేల పాఠశాలల్లో సుమారు 21 వేల పాఠశాలలకు కనీసం సరైన మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదని చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థులు, విద్యాసంస్థలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం విదేశీ పర్యటనలతో కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల సమస్యలు, వారి భవిష్యత్తుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అంటూ అనేక హామీలు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు.
అమెరికా వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వలేదని చెబుతూ ప్రెస్‌మీట్ పెడతానంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా తన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సమాధానం చెప్పాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. యూనివర్సిటీలు, కాలేజీల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక, పైచదువుల కోసం అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాలు ఇవ్వడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మూడేళ్లు గడిచినా విద్యార్థులకు బకాయిలు చెల్లించలేదని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను నిర్వీర్యం చేయాలనే కుట్ర ఉందా? అని ఎంపీ ఆర్ కృష్ణయ్య అనుమానం వ్యక్తం చేశారు.

More Stories
కదం తొక్కిన బీజేపీ మహిళా మోర్చా ‘మహిళా శక్తి స్కూటీ ర్యాలీ’
హైడ్రా, తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
ప్రత్యర్థులం కాదు, భాగస్వాములం.. భారత్-చైనా ఏకాభిప్రాయం’!