ఫీజు బకాయిలకై దీక్ష విరమించిన రామచందర్ రావు 

ఫీజు బకాయిలకై దీక్ష విరమించిన రామచందర్ రావు 
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన రెండు రోజుల మహా నిరాహార దీక్షను మంగళవారం ముగించారు.  నిరాహార దీక్ష కారణంగా రాంచందర్ రావు రక్తపోటు పడిపోవడం, షుగర్ లెవెల్స్ తగ్గడంతో ఆరోగ్యం క్షీణించింది.
దానితో దీక్షా శిబిరానికి వచ్చిన వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, దీక్షను కొనసాగిస్తే ఆయన ఆరోగ్యానికి  ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు, వైద్యుల సలహాను గౌరవిస్తూ ఆయన  నిమ్మరసం స్వీకరించి నిరాహార దీక్షను విరమించారు. 
దీక్షా శిబిరంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ చతుల మీదుగా, బీజేఎల్పీ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర ముఖ్య నేతలు ఆయనకు  నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు.

దీక్ష విరమణ అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ “నిరాహార దీక్ష ముగిసినా, విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ పోరాటం ఆగదు. ప్రభుత్వం మొండివైఖరి వీడి రూ. 15,000 కోట్ల బకాయిలను పైసా పైసా చెల్లించేవరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం” అని స్పష్టం చేశారు. విద్యార్థులకు న్యాయం జరగకపోతే త్వరలోనే సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ మెడలు వంచుతామని హెచ్చరించారు. 


ఈ ప్రజాస్వామ్య నిరసనను అణచివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ కార్యకర్తల సంకల్పం ముందు అవి వీగిపోయాయి. మొదట ధర్నా చౌక్ వద్ద అనుమతి నిరాకరించడం, కనీసం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు కూడా దీక్ష చేసుకోవడానికి పోలీసులు నిరాకరించి అడ్డుకోవాలని చూశారు. కనీసం దీక్ష శిబిరానికి వైద్య బృందాన్ని, అంబులెన్స్ సేవలను కూడా ప్రభుత్వం నిరాకరించింది. 
 
అయితే ప్రభుత్వ నిర్బంధాలు, పోలీసు ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా రాంచందర్ రావు పార్టీ కార్యాలయ ప్రాంగణంలోనే పట్టుదలతో నిరాహార దీక్షను కొనసాగించారు. ఈ మహా దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలు, మేధావులు, కళాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉద్యమ గీతాలు, ఆటపాటలు, ధూంధాం సాంస్కృతిక ప్రదర్శనలతో నాంపల్లి రాష్ట్ర కార్యాలయ ప్రాంగణం సమరశంఖాన్ని తలపించింది. 
 
ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీలతో పాటు ప్రముఖ ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, ఆయుర్వేద, యూనాని, హోమియోపతి కళాశాలల విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి ఆయనకు  ప్రత్యక్షంగా తమ ఆవేదనను తెలియజేసి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. యువమోర్చా క్షేత్రస్థాయిలో సేకరించిన 5 లక్షల మంది విద్యార్థుల సంతకాల పత్రాలను ఈ సందర్భంగా సమర్పించి కాంగ్రెస్ సర్కార్‌కు హెచ్చరిక జారీ చేసింది.

ఈ పోరాటానికి  బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, వివిధ జిల్లాల అధ్యక్షులు దీక్షా శిబిరానికి తరలివచ్చి మద్దతు పలికారు. వీరితో పాటు డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షులు, వివిధ విద్యాసంస్థల అధినేతలు, కాలేజీ యాజమాన్యాలు, అధ్యాపకులు, లెక్చరర్లు, ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, కార్మిక సంఘాల నేతలు, ఎక్స్-సర్వీస్‌మెన్ సంఘాల ప్రతినిధులు తరలివచ్చి ఫీజు బకాయిల సాధనలో బీజేపీకి అండగా ఉంటామని ముక్తకంఠంతో చాటిచెప్పారు.

ఈ సందర్భంగా దీక్షా ప్రాంగణంలో బీజేపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. “ఎన్నికలప్పుడు యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలిచ్చి అశోక్ నగర్ లైబ్రరీ వద్ద నిరుద్యోగ యువత కాళ్లు మొక్కి, బాండ్లు రాసిచ్చిన నాయకులు తీరా గద్దెనెక్కాక అదే విద్యార్థుల పొట్టకొడుతున్నారు” అంటూ మండిపడ్డారు. 

 
పేద బిడ్డల చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వమంటే చేతులెత్తేసి, ఢిల్లీ పెద్దలకు రాచమర్యాదలు చేయడానికి మాత్రం వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థుల గోడు పట్టదు కానీ, హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ పర్యటనల పేరుతో విదేశాల్లో విహరించడానికి సమయం దొరుకుతుందని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ ‘ఛాత్రోం కీ గూంజ్’ అని విద్యార్థుల కోసం పోరాడుతున్నట్లు నాటకాలు ఆడే రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పాలిత తెలంగాణలో విద్యార్థులు చేస్తున్న రోదన ఎందుకు వినపడటం లేదు? అని ప్రశ్నించారు.