మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో తనయుడు ఆరవ్ వర్మను తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై పోలీసులు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని జీఎంఈ కాలనీలో ఉన్న అప్పలరాజు నివాసంలో బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేయొచ్చనే సమాచారంతో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ఇంటి వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.  పోలీసుల వివరాల ప్రకారం ఇటీవల పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  దానయ్య అనే గొర్రెల కాపరి  మృతిచెందాడు.  తొలుత ఈ ప్రమాదానికి మరో వ్యక్తి వాహనం నడిపినట్లు కేసు నమోదు చేసినప్పటికీ, దర్యాప్తులో సేకరించిన సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా మాజీ మంత్రి కుమారుడే ప్రమాద సమయంలో వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు.
దర్యాప్తును ప్రభావితం చేయడంతో పాటు తన కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారనే అభియోగాలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకుని  విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.  ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  ఈ కేసు నుంచి కుమారుడు ఆరవ్ వర్మను తప్పించేందుకు సీదిరి అప్పలరాజు కుట్ర చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
తన కుమారుడు ఆరవ్ వర్మ బదులుగా సిద్ధార్థ త్యాడి అనే యువకుణ్ని జైలుకు పంపించాలని చూసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత దానయ్య కుటుంబాన్ని ప్రలోభాలకు గురి చేశారని, ప్రమాదానికి కారణమైన బైకును దాచి నేరం కప్పిపుచ్చే ప్రయత్నం చేశారంటూ సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసులో అప్పలరాజును ఏ3గా చేర్చారు. ఈ కేసులో సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ వర్మ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం ఆరవ్ వర్మ రిమాండ్‌లో కొనసాగుతున్నారు. ఇక ఈ కేసులో అప్పలరాజుకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, ఎస్ఐ సునీల్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 
 
ప్రమాదం అనంతరం ఘటనాస్థలిని సందర్శించలేదని, కిందిస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే నిందితుణ్ని మార్చేందుకు పోలీసులే అవకాశం ఇచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీఐ, ఎస్ఐ మీద చర్యలు తీసుకుంది.