జోర్డాన్‌లో ఇద్దరు అమెరికా సైనికులు హతం, మరొకరు గల్లంతు

జోర్డాన్‌లో  ఇద్దరు అమెరికా సైనికులు హతం, మరొకరు గల్లంతు

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌ల దాడిని ఎదుర్కొంటూ శుక్రవారం జోర్డాన్‌లో ఇద్దరు అమెరికన్ సైనికులు మరణించారని, శనివారం జారీ చేసిన ఒక ప్రకటనలో యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ధృవీకరించింది. దీంతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మరణించిన అమెరికన్ సైనికుల మొత్తం సంఖ్య 16కు పెరిగింది, కాగా 430 మందికి పైగా గాయపడ్డారు. దానితో అందుకు కారణమైన ఇరాన్ యొక్క ‘రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ను “త్వరితగతిన శిక్షించే అమెరికా ఆదివారం నాడు ఇరాన్‌పై కొత్తగా వైమానిక దాడులు చేపట్టిందని అమెరికా సెంట్రల్ కమాండ్  తెలిపింది.

  “ఈ రోజు సాయంత్రం 6 గంటలకు, సర్వసైన్యాధిపతి ఆదేశాల మేరకు అమెరికా దళాలు ఇరాన్‌పై కొత్త వైమానిక దాడులను ప్రారంభించాయి. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత దెబ్బతీయడం, నిన్న రాత్రి జోర్డాన్‌లో అమెరికా సైనికులపై దాడులకు పాల్పడిన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ దళాలను తక్షణమే శిక్షించడం ఈ దాడుల ఉద్దేశ్యం,” అని సెంటకామ్  పేర్కొంది.

జూలై 17న, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ దాడులను ఎదుర్కొంటున్నప్పుడు, జోర్డాన్‌లో సెంట్‌కామ్, భాగస్వామ్య దళాల మధ్య జరిగిన పోరాటంలో ఇద్దరు అమెరికన్ సైనికులు మరణించారని పెంటగాన్ తన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఒక సైనికుడు గల్లంతయ్యాడని కూడా అది పేర్కొంది. ఆ ప్రకటన ప్రకారం, నలుగురు అమెరికన్ సైనికులను వైద్య చికిత్స కోసం జోర్డాన్‌లోని ఆసుపత్రులకు తరలించారు. 

ఆ నలుగురినీ అప్పటి నుండి డిశ్చార్జ్ చేశారు. స్వల్ప గాయాలైనట్లు నిర్ధారించబడిన ఇతర సిబ్బంది ఇప్పటికే తిరిగి విధుల్లో చేరారు. మరణించిన సైనికుల బంధువులకు అధికారికంగా తెలియజేసిన 24 గంటల తర్వాతే, వారి గుర్తింపులతో సహా మరిన్ని వివరాలను విడుదల చేస్తామని సెంట్‌కామ్ తెలిపింది. 

ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తే అమెరికా “మరపురాని గుణపాఠాలు” నేర్చుకోవాల్సి వస్తుందని ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ మరోసారి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అమెరికా సైన్యం ఈ ప్రకటన చేసింది. ఎక్స్ లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో, “అమెరికా శత్రువు” ఇప్పుడు యుద్ధాన్ని రెచ్చగొట్టి, దాని పరిణామాలను భరించాలని చూస్తున్నందున, ఇరాన్ జాతి, ప్రతిఘటన కూటమి ఆ “అమెరికా శత్రువుకు” మరచిపోలేని గుణపాఠాలు నేర్పుతాయని ఆయన పేర్కొన్నారు. 

యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి బహిరంగంగా కనిపించని ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉన్న ఒప్పందాన్ని కూడా “విలువలేనిది,  చెల్లనిది” అని కొట్టిపారేశారు. ఈ తాజా పరిణామాలు దౌత్యపరమైన పరిష్కార అవకాశాలను మరింత దూరం చేశాయి. ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు, సైనిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, భూగర్భ ఆయుధ నిల్వలు,  సముద్ర సామర్థ్యాలపై దాడి చేసినట్లు అమెరికా సైన్యం శనివారం అంతకుముందు తెలిపింది. 

ఇది వరుసగా ఏడవ రాత్రి జరిగిన దాడులని పేర్కొంది. ప్రతిగా టెహ్రాన్, కువైట్, ఇరాక్, బహ్రెయిన్, జోర్డాన్ మరియు, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. శనివారం ఇరాన్ జరిపిన దాడుల వల్ల కువైట్‌లో అత్యంత తీవ్రమైన నష్టం వాటిల్లింది. అక్కడ ఒక నీటి శుద్ధి కర్మాగారం, ఒక చమురు కేంద్రం రెండూ దెబ్బతిన్నాయి.