సంక్లిష్ట, వినూత్న శస్త్రచికిత్సల మార్గదర్శి ఆచార్య సుశ్రుతుడు

సంక్లిష్ట, వినూత్న శస్త్రచికిత్సల మార్గదర్శి ఆచార్య సుశ్రుతుడు
అనేక సంక్లిష్ట, వినూత్న శస్త్ర చికిత్స ప్రక్రియల మార్గదర్శిగా ఆచార్య సుశ్రుతుడు ప్రసిద్ధి పొందినట్లు రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము తెలిపారు. ఆయన జీవించి ఉన్న కాలంలో ప్లాస్టిక్ సర్జరీ, కంటిపొర చికిత్స, కణుతుల చికిత్స, చెవి ముక్కు గొంతు చికిత్స వంటి వేర్వేరు రంగాల్లో కొత్త మెళకువలను అందించారని చెప్పారు.
 
 ఆ సుశ్రుత జయంతిని పురస్కరించుకొని ‘సౌశ్రుతమ్- 2026’ కార్యక్రమాన్ని రాష్ట్రపతి  న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో ప్రారంభిస్తూ ఆయన రచించిన ‘సుశ్రుత సంహిత’ ఒక్క భారత ఉపఖండానికే కాక పూర్తి ప్రపంచానికి కొత్త దిశను అందించిందని పేర్కొన్నారు.   శస్త్రచికిత్సను ఆచార్య సుశ్రుతుడు వందల ఏళ్ల కిందట మొదలుపెట్టారనీ, ఆ కాలంలో అది ఒక విప్లవాని కన్న తక్కువదేమీ కాదనీ రాష్ట్రపతి స్పష్టం చేశారు. 

మన సంప్రదాయాల్లో పొందుపరిచిన మానవ సంక్షేమానికి దోహదపడే జ్ఞ‌ానాన్ని మారుతున్న కాలాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోయే క్రమాన్ని అనుసరిస్తే సమాజానికి మేలు కలుగుతుందని రాష్ట్రపతి సూచించారు. ఆయుర్వేదానికి ఉన్న జీవన సమగ్ర దృష్టికోణం మానవాళికి వరప్రసాదమని చెబుతూఈ ప్రాచీన జ్ఞ‌ానం ఇవాళ్టికీ సందర్భశుద్ధి కలిగిందే కాకుండా ప్రభావవంతమైనదిగా మనం నిర్ధారించాల్సిన అవసరం ఉందని  రాష్ట్రపతి స్పష్టం చేశారు. 

ఆయుర్వేద, యోగా..  వీటిని  కేంద్ర ప్రభుత్వం  ప్రపంచ స్థాయిలో సరికొత్తగా ఆవిష్కరించిందని రాష్ట్రపతి చెప్పారు. ప్రాచీన సాంప్రదాయిక శస్త్రచికిత్సను అన్ని శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగా రుజువుచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిసి తాను సంతోషిస్తున్నానని శ్రీమతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రామాణీకరించిన దస్తావేజుల పద్ధతి, డిజిటల్ ఆరోగ్య ఏకీకరణలతో పాటు ఆధునిక శాస్త్రవిజ్ఞ‌ాన పరిశోధన మెళకువలను ప్రభావవంతంగా ఉపయోగిస్తే ఈ పద్ధతికి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతుందని రాష్ట్రపతి తెలిపారు. 

ఆచార్య సుశ్రుతుడు చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ వైద్యంలో నైతికతతో పాటు రోగులకు కరుణతో సేవలు అందించడం పట్ల కూడా ఆసక్తిని స్థిరంగా నిలబెట్టుకోవలసిందిగా రాష్ట్రపతి వారికి విజ్ఞ‌ప్తి చేశారు.  వృత్తి జీవితాన్ని మొదలుపెడుతున్న యువ విద్యార్థులు, పరిశోధకుల చేతుల్లో  ఆయుర్వేద భవిష్యత్తు ఉందని రాష్ట్రపతి చెప్పారు.

 
ఆసక్తి, నిజాయతీ, శాస్త్రవిజ్ఞ‌ానం పట్ల మక్కువతో స్ఫూర్తిని పొంది ఆచరణీయ పరిశోధనలతో పాటు తమ రంగంలో అధిక నాణ్యతతో కూడిన ప్రమాణాలను సమీకరించే మార్గంలో ముందుకు వెళ్లాలంటూ రాష్ట్రపతి సలహా ఇచ్చారు.   ‘సౌశ్రుతమ్- 2026’లో చోటు చేసుకోబోయే చర్చలు ఆయుర్వేద శస్త్రచికిత్స రంగంలో కొత్త జ్ఞ‌ానాన్ని అందిస్తాయన్న, అంతర్జాతీయ సహకారం మరింత పటిష్ఠం కాగలదన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.   ఇలాంటి అర్థవంతమైన కార్యక్రమాలను నిర్వహించడం వల్ల సమగ్ర ఆరోగ్యసంరక్షణ వ్యవస్థకు ఆయుర్వేదం అందించే తోడ్పాటును పెంపొందింప చేయడంలో సహాయం లభిస్తుందని చెప్పారు.