మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బుధవారం మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు మదన్ మిత్ర పార్టీకి రాజీనామా చేసి, రిటబ్రత బెనర్జీ నాయకత్వంలోని రెబల్ తృణమూల్ వర్గంలో చేరారు. పార్టీలో ఇటీవల తలెత్తిన అంతర్గత సంక్షోభ సమయంలోనూ ఆయన మమతా బెనర్జీకి అండగా నిలిచారు. శాసనసభ, పార్లమెంటరీ స్థాయిలలో తిరుగుబాట్లను ఎదుర్కొంటూ, తీవ్రమైన అంతర్గత సంక్షోభం, ఉనికి కోసం పోరాడుతున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీని వీడుతున్న వారి సుదీర్ఘ జాబితాలో మిత్ర రాజీనామా తాజా పరిణామం.
‘రెబల్’ రిటబ్రత వర్గ నాయకుడు, ఎంటాలీ ఎమ్మెల్యే సందీపన్ సాహాను కలిసిన మరుసటి రోజే, మమతా బెనర్జీకి దీర్ఘకాలంగా నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చిన కమర్‌హతి ఎమ్మెల్యే, ఆమె నేతృత్వంలోని పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ మున్సిపల్ నియామకాల కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేయడంతో, మిత్రా, ఆయన కుటుంబంపై ఉచ్చు బిగుసుకుంటున్న తరుణంలోనే ఈ రాజీనామా జరిగింది.
ఈ దర్యాప్తులో భాగంగా మంగళవారమే ఈడీ అధికారులు మిత్ర భార్య, ఇద్దరు కుమారులకు సమన్లు జారీ చేశారు. డబ్బు, బంగారం తీసుకుని మున్సిపల్ సంస్థలలో నియామకాలు జరిపారన్న ఆరోపణలపై మిత్రను విచారిస్తున్నారు. పార్టీని వీడాలన్న తన నిర్ణయం గురించి వివరిస్తూ, మిత్రా అభిషేక్ బెనర్జీపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి తాను చేసిన సూచనలను ఆయన పట్టించుకోలేదని పేర్కొన్నారు.
“అభిషేక్ బెనర్జీ ఆరు నెలలు లేదా ఏడాది పాటు పక్కకు తప్పుకోవాలని నేను సూచించాను. ముందుగా మనం పార్టీని పునర్నిర్మించి బలోపేతం చేసుకోవాలని, ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చి తన పదవిని చేపట్టవచ్చని చెప్పాను. కానీ ఆయన అందుకు నిరాకరించారు. పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు,” అని మిత్ర తెలిపారు.

More Stories
ఈ-20ని ప్రశ్నించిన నలుగురిపై ఎఫ్ఐఆర్లు
ఎన్డీయే వైపు మొగ్గు చూపుతున్న శరద్ పవార్
దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో లైంగిక విద్య