తెలంగాణాలో తారాస్థాయికి కాంగ్రెస్ మార్క్ ‘ఎడ్యుకేషన్ జిహాద్’

తెలంగాణాలో తారాస్థాయికి కాంగ్రెస్ మార్క్ ‘ఎడ్యుకేషన్ జిహాద్’
 
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ‘ఎడ్యుకేషన్ జిహాద్’ తారాస్థాయికి చేరిందని, హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో జరిగిన ఘటన దీనికి ప్రత్యక్ష నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థిని చేత కల్మా చదివించి, హోం వర్క్‌గా కల్మా, ‘సూరా అల్-ఫాతిహా’లను నేర్చుకుని, పుస్తకాల్లో రాసుకుని ఇంటికి తీసుకువెళ్లాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించడం అత్యంత ఆందోళనకరమని ఆయన ఖండించారు. 
 
ఈ దుశ్చర్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. “కాంగ్రెస్ అంటే ముస్లింలు.. ముస్లింలు అంటే కాంగ్రెస్” అంటూ ఆయన చేసిన ఓటు బ్యాంకు, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల వల్లే ఇలాంటి తీవ్రవాద ఆలోచనలు ఉన్న శక్తులకు తెగింపు పెరిగిందని రాంచందర్ రావు మండిపడ్డారు. తన రెండవ తరగతి బిడ్డ చేత బలవంతంగా కల్మా రాయించడాన్ని గమనించి, ధైర్యంగా పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసిన ఆ చిన్నారి తల్లి సాహసాన్ని ఆయన అభినందించారు.
ఇంతటి తీవ్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ సదరు పాఠశాల యాజమాన్యంపై ఇప్పటివరకు ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.  కేవలం ఒక ముస్లిం టీచర్‌ను బాధ్యత నుంచి తప్పిస్తే సరిపోదని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత స్కూల్ మేనేజ్‌మెంట్‌దేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణని పేర్కొంటూ హిందూ విద్యార్థులు, వారి కుటుంబాల భద్రత, ఆత్మగౌరవంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కళ్ళు మూసుకుని వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. హిందూ విద్యార్థులపై వారి మతానికి సంబంధం లేని ప్రార్థనలు, కల్మాలు బలవంతంగా రుద్దడం ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. 
కొన్ని కాన్వెంట్ స్కూళ్లలో హిందూ విద్యార్థులు బొట్టు పెట్టుకుని రాకూడదని ఒత్తిడి చేస్తూ మతాచారాలకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.  విద్యా సంస్థలు విద్యను అందించాలి తప్ప, విద్యార్థులపై ఏ మతాన్నీ రుద్దే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే  ‘ఎడ్యుకేషన్ జిహాద్’ ఉదంతంపై నిష్పాక్షికమైన, సమగ్రమైన దర్యాప్తు జరిపి, పాఠశాల యాజమాన్యంతో పాటు ఈ ఘటనకు కారకులైన ప్రతి ఒక్కరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని   రాంచందర్ రావు డిమాండ్ చేశారు.