ఆధునీకరించిన హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రధాని శ్రీకారం

ఆధునీకరించిన హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రధాని శ్రీకారం
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించిన హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్చువల్‌గా ప్రారంభించనున్నా రు. హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లలో తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రూ. 25వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌తో సహా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను పర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 
 
ఈ సంధర్భంగా, హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో నిర్వహించబడనున్న ఒక కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద, 20 రాష్ట్రాల్లో 75 అమృత్ స్టేషన్లను ఆధునీకరించారు. రూ.1,570 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లు ప్రయాణికులకు అత్యాధునిక, సౌకర్యవంతమైన, ప్రయాణికుల అవసరాలకు అనుగుణమైన సదుపాయాలను అందించేలా రూపుదిద్దుకున్నాయి. 
 
ఆయా ప్రాంతాల స్థానిక సంస్కృతి, వారసత్వం, సాంప్రదాయ నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సుమారు రూ. 26 కోట్ల వ్యయంతో ఆధునీకరించారు. సమకాలీన వాస్తుశిల్పం, విమానాశ్రయాన్ని తలపించే విశాలమైన ప్రయాణికుల సౌకర్యాలు, అత్యాధునిక రూపకల్పనతో సరికొత్త రూపును సంతరించుకుంది. 
 
ఈ స్టేషన్ విశాలమైన, సాంకేతికత ఆధారిత, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నవాతావరణాన్ని అందిస్తూ, హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌కు సమర్థవంతమైన, సౌకర్యవంతమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ప్రవేశ ద్వారంగా నిలుస్తోంది. తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికచేసిన 40 రైల్వే స్టేషన్లలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఒకటి.