భాగ్యనగర్‌లోని సైదాబాద్‌లో ఉన్న సక్సెస్ స్కూల్‌లో రెండో తరగతి హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్-ఫాతిహా నేర్చుకుని రావాలని హోమ్‌వర్క్ ఇవ్వడం అత్యంత అభ్యంతరకర విషయం అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్యా సంస్థలు విద్యను బోధించాల్సిందే తప్ప, ఏ విద్యార్థిపైనా మతపరమైన అంశాలను బలవంతంగా రుద్దే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
మొన్నటికి మొన్న ఆర్మూరులో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా హిందూ పిల్లలకు ఉర్దూ నేర్పిస్తారని, ఇదేంటని ప్రశ్నించిన ప్రజలపై అక్రమ కేసులు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటికి నిన్న అత్తా పూర్ లో ఆటో వెనక దేవుడి కొటేషన్ రాసుకున్న హిందువును ఒవైసీ, మజ్లిస్ పార్టీ నాయకులు బెదిరించి, భయబ్రాంతులకు గురిచేస్తాయని అంటూ ధ్వజమెత్తారు.
నేడు సైదాబాద్‌లో హిందూ విద్యార్థులకు కల్మా నేర్పిస్తున్నారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ ప్రభుత్వం కలిసి హైదరాబాద్ ను, తెలంగాణను ఏం చేయాలని చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గమైన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో అన్ని ప్రైవేటు స్కూళ్లలో పాఠాల బోధనపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెంచాలని ఆయన కోరారు. రాజ్యాంగబద్ధమైన మత స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ఒక్క విద్యాసంస్థ బాధ్యత అని చెబుతూ అలా కాకుండా.. మతాంతీకరణ చేస్తాం, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఉందని ఎవరైనా ప్రయత్నిస్తే చూస్తూ ఉరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనికి తగినమూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
More Stories
ఆధునీకరించిన హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రధాని శ్రీకారం
తెలంగాణాలో తారాస్థాయికి కాంగ్రెస్ మార్క్ ‘ఎడ్యుకేషన్ జిహాద్’
ధర్నాచౌక్ వద్ద వేలాదిమంది నిరుద్యోగుల రణభేరి