భవిష్యత్తులో సింగరేణి సంస్థకు ఏవైనా సవాళ్ళు ఎదురైతే ఎదుర్కొవడానికి, ఇంకా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకుని రావడానికి వీలుగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సంస్థ యాజమాన్యానికి సూచించారు. కొత్త గనులు సాధించి పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలకు తోడ్పాటును అందించాలని చెప్పారు. శనివారం ఆయన సిం గరేణి సంస్థ పని తీరు,
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి పెంచడం కోసం అవసరమైన కొత్త బ్లాక్‌లను బొగ్గు శాఖ నిర్వహించే వేలం పాటలో పాల్గొని సాధించాలని ఆయన సూచించారు. దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 10 నుంచి 15 సంవత్సరాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశ ఇంధన రంగంలో ఇంకా సుదీర్ఘ కాలం బొగ్గు కీలక పాత్ర పోషించిందని చెబుతూ బొగ్గు ఉత్పత్తిని గణనీయం గా పెంచడంపై దృష్టి సారించాలని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ, పని సామర్థ్యాన్ని మరింతగా పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు.
సంస్థ వాణిజ్యపరమైన విజయాలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగాలని ఆయన చెప్పారు. దేశంలో కోల్ గ్యాసిఫికేషన్ కు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెబుతూ ప్రారంభ దశలో చిన్న స్థాయిలో అయినా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు చేపట్టడంపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఫెర్టిలైజర్స్ తదితర పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి కోల్ గ్యాసిఫికేషన్‌కు పూనుకోవాలని కిషన్ రెడ్డి చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా, ఇంకా మన దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో వ్యవసాయ, ఇతర పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ ఉత్పాదనకు తగినంత బొగ్గు అందించడానికి కోలిండియా తోపాటు సింగరేణి కూడా సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి ప్రసంగిస్తూ సింగరేణిలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంలో ఎదురవుతున్న పలు సవాళ్లను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ముఖ్యంగా సింగరేణికి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్పైజెస్ స్టేటస్ తొలగించడం వల్ల అటవీ భూ సేకరణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ అంశంపై అతి త్వరలోనే సానుకూల నిర్ణయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గనిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు రవాణా విషయంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని ఆయన హామీ ఇచ్చారు.

More Stories
భద్రకాళి సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రమాణాల రభస.. బీజేపీ శుద్ధి
విశ్వశాంతి స్థాపనలో ప్రధాని మోదీ ఏకైక ఆశాకిరణం
మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్ లో మంత్రుల వాడీవేడి చర్చలు