ఫాతిమా ఒవైసీ విద్యా సంస్థలపై ఆరోపణలను పట్టించుకోరే!

సల్కం చెరువు బఫర్ జోన్ లో బారిస్టర్ ఫాతిమా ఒవైసీ విద్యా సంస్థలు ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మజ్లిస్ అంటే భయమా? ప్రేమా? లేక రెండూ ఉన్నాయా? అని ఆయన ‘ఎక్స్’ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  మజ్లిస్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ఆయన దుయ్యబట్టారు.
భూములు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కమీషన్ల కోసం ఆరాటపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సామాన్య ప్రజల జీవనోపాధిని బలిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో మజ్లిస్ పార్టీని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడటం లేదని ఆయన దుయ్యబట్టారు.  రేవంత్ సర్కార్ పక్షపాత పాలనకు హైడ్రా ఓ ఉదాహరణ అని తెలిపారు.
సామాన్య ప్రజల విషయంలో మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం సల్కం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ విషయంలో మాత్రం మౌనంగా ఉంటూ మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన విమర్శించారు. 
రాష్ట్ర హైకోర్టు పలుమార్లు జోక్యం చేసుకుని ప్రభుత్వ జాప్యంపై చీవాట్లు పెట్టినా ప్రభుత్వ తీరులో రావడం లేదని, హైడ్రా, విద్యా శాఖ సహా పలు శాఖల నుంచి వివరాలు కోరినా సామాన్య ప్రజల విషయంలో చూపే తొందరపాటును ఫాతిమా కాలేజ్ వ్యవహారంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూపించడం లేదని ఆయన విమర్శించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ పార్టీని యావత్ ముస్లిం సమాజానికి ప్రతినిధిగా భావిస్తున్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఇది పూర్తిగా తప్పు. హైడ్రా చర్యల వల్ల పేద ముస్లింల ఇళ్లు కూడా కూల్చివేసి, వారి జీవనోపాధి దెబ్బతిన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో వారి తరఫున మజ్లిస్ గానీ, కాంగ్రెస్ గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన తెలిపారు. 
 
కానీ ఒవైసీ సోదరుల ఆస్తుల విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలు ఒకే ఆలోచనతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ముస్లిం సమాజంపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమలేదని, తమ మిత్రుడైన ఒవైసీకి ఇబ్బంది కలగకూడదన్నట్లుగా, మజ్లిస్ ప్రయోజనాలకు కాపాడేలా రేవంత్ సర్కారు వ్యవహరిస్తోందని స్పష్టంగా అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. 

About The Author