బలూచీ ఆత్మాహుతి దాడుల్లో 30 మంది పాక్ భద్రతా సిబ్బంది మృతి

బలూచీ  ఆత్మాహుతి దాడుల్లో 30 మంది పాక్ భద్రతా సిబ్బంది మృతి
పాకిస్థాన్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మరోసారి భారీ వ్యూహాత్మక దాడికి తెగబడింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ జిల్లా జివానీ పరిధిలోని పాన్వాన్ ప్రాంతంలో గల పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ ప్రధాన శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని బీఎల్ఏ గురువారం సాయంత్రం అత్యంత ఘోరమైన ఆత్మాహుతి దాడి జరిపింది. 
 
ఈ భీకర దాడిలో దాదాపు 30 మందికి పైగా పాకిస్థానీ కోస్ట్ గార్డ్స్ సిబ్బంది అక్కడికక్కడే మరణించారని, డజన్ల కొద్దీ గాయపడ్డారని బీఎల్ఏ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) పరిధిలో కీలకమైన గ్వాదర్ ప్రాంతంలో ఈ స్థాయి దాడి జరగడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. బీఎల్ఏ మీడియా ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం జూలై 3వ తేదీ సాయంత్రం సుమారు 6.32 గంటల సమయంలో ఈ ఆపరేషన్ జరిగింది.
 
బీఎల్ఏకు చెందిన అత్యంత ప్రమాదకరమైన మజీద్ బ్రిగేడ్ సభ్యుడు అల్తావుల్లా బలోచ్ అలియాస్ అజ్మల్ భారీగా పేలుడు పదార్థాలు నింపిన ఒక మాజ్డా వాహనాన్ని వేగంగా కోస్ట్ గార్డ్స్ క్యాంప్‌లోకి తీసుకెళ్లి పేల్చివేశాడు. ఈ పేలుడు ధాటికి సైనిక స్థావరం పూర్తిగా శిధిలమై పోయింది. అంతటితో ఆగకుండా పేలుడు జరిగిన వెంటనే బీఎల్ఏకు చెందిన ఫతే స్క్వాడ్ తుపాకులతో క్యాంప్‌లోకి చొరబడింది. 
 
లోపల ప్రాణాలతో మిగిలి ఉన్న పాకిస్థానీ భద్రతా సిబ్బందిపై అత్యంత సమీపం నుంచి ఎదురుకాల్పులు జరిపి అనేక మందిని చంపేసింది. శిథిలాల కింద మరికొందరు సైనికులు చిక్కుకుపోయినందున మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని బీఎల్ఏ ప్రకటించింది. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం గానీ, అక్కడి సైనిక వర్గాలు (ఐఎస్‌పీఆర్) గానీ ఈ భారీ నష్టంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 
 
బలూచిస్థాన్ వివాదాస్పద ప్రాంతాల్లో అంతర్జాతీయ మీడియాపై పాక్ సైన్యం కఠిన ఆంక్షలు విధించడంతో ఈ మరణాల సంఖ్యను స్వతంత్రంగా ధ్రువీకరించడం కష్టంగా మారింది. అయినప్పటికీ ఈ ఘోర దాడి అనంతరం గ్వాదర్ తీర ప్రాంతమంతా సైనికుల మోహరింపుతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బలూచ్ పౌర సంఘాలు పాక్ సైన్యంపై మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే ఈ ప్రతీకార దాడి జరగడం గమనార్హం.

బలూచిస్థాన్ ప్రావిన్స్‌కు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పించాలని, తమ ప్రాంతంలోని సహజ వనరులపై తమకే నియంత్రణ ఉండాలనే డిమాండ్‌తో బీఎల్ఏ దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తోంది. పాక్ దళాలను ‘ఆక్రమణ దారులు’గా అభివర్ణించే ఈ సంస్థ తమ పూర్తి స్వాతంత్ర్యం సిద్ధించేవరకు దాడులు ఆపబోమని స్పష్టం చేసింది. బిఎల్ఏ ఆ ప్రావిన్స్‌లో సైనిక, పారామిలిటరీ, ప్రభుత్వ సంస్థలను తరచుగా లక్ష్యంగా చేసుకుంటున్నది.