ప్రభుత్వ విధానాలతోనే ప‌శ్చిమాసియా సంక్షోభం నుండి గట్టెక్కాం

ప్రభుత్వ విధానాలతోనే ప‌శ్చిమాసియా సంక్షోభం నుండి గట్టెక్కాం
 
గ‌త ద‌శాబ్ధ కాలం నుంచి విజ‌య‌వంత‌మైన విధానాల అమ‌లు ద్వారా ప‌శ్చిమాసియా  సంక్షోభ ప‌రిస్థితి నుంచి గ‌ట్టెక్కిన‌ట్లు ప్రధాని నరేంద్ర మోదీ  తెలిపారు. తీవ్ర‌మైన ఇంధ‌న సంక్షోభం ఉన్నా అమిత‌మైన అనుభ‌వం వ‌ల్ల ఆ సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ఆయ‌న చెప్పారు. రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ప్రధాని శనివారం జాతికి అంకితం చేశారు.
 
యుద్ధ స‌మ‌యంలో వివిధ దేశాల‌తో ఉన్న స్నేహ‌సంబంధాలు భార‌త్‌కు క‌లిసి వ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభానికి ముందు కేవ‌లం 26 దేశాల నుంచి మాత్ర‌మే భార‌త్ ఇంధ‌నాన్ని దిగుమ‌తి చేసుకునేద‌ని, కానీ సంక్షోభ స‌మ‌యంలో భార‌త్ త‌న దౌత్య బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించింద‌ని, యుద్ధం  జ‌రుగుతున్నా  సుమారు 40 దేశాల నుంచి భార‌త్ ఇంధ‌నాన్ని దిగుమ‌తి చేసుకున్న‌ట్లు చెప్పారు. 
 
దేశ ప్ర‌యోజ‌నాలు, ప్ర‌జ‌ల సంక్షేమ‌మే కీల‌క‌మ‌న్న విష‌యాన్ని ప్ర‌భుత్వం చాటి చెప్పింద‌ని ప్రధాని పేర్కొన్నారు. అయితే ఆ అంశంపై విప‌క్షాలు ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌ల‌న‌ల‌కు గురి చేశాయ‌ని, ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని, రాజ‌కీయ క్రీడ‌లు ఆడార‌ని విమ‌ర్శించారు. కానీ చెడు ప్ర‌య‌త్నాలు చేసిన వాళ్లు విజయవంతం కాలేద‌ని చెప్పారు. చిన్న చిన్న అవ‌రోధాలు త‌ప్ప‌, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంధ‌న స‌ర‌ఫ‌రాలో పెద్ద‌గా స‌వాళ్లు ఎదురు కాలేద‌ని మోదీ అన్నాతెలిపారు.
 
ఏప్రిల్ నుంచి జూన్ మ‌ధ్య కాలంలో వివిధ ఇంధ‌న కంపెనీలు డీజిల్‌, పెట్రోల్‌పై సుమారు 75 వేల కోట్ల న‌ష్టాన్ని చ‌విచూశాయ‌ని ప్రధాని పేర్కొన్నారు. అయితే ఆ న‌ష్టాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రించింద‌ని, లీట‌రుపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 త‌గ్గించిన‌ట్లు మోదీ తెలిపారు. ప్ర‌జ‌లపై ఎటువంటి అద‌న‌పు భారం ప‌డ‌కుండా చూశామ‌ని చెప్పారు. భార‌తీయ ఇంధ‌న‌, పెట్రో కెమిక‌ల్ రంగంలో ఈ రిఫైనరీ కీల‌మైన మైలురాయి అని పేర్కొన్నారు. 
 
రిఫైన‌రీ కాంప్లెక్స్ టూర్ చేసిన త‌ర్వాత ఆయ‌న రిమోట్ బ‌ట‌న్ నొక్కి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్ర‌తి ఏడాది ఆ రిఫైన‌రీలో సుమారు 2.4 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల పెట్రోకెమిక‌ల్ ఉత్ప‌త్తుల‌ను రిఫైన్ చేయ‌నున్నారు. అంత‌క‌ముందు ఆయ‌న జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టులో కొత్త ట‌ర్మిన‌ల్‌ను ప్రారంభించారు. కొత్త ఉడాన్ స్కీమ్‌ను ఆవిష్క‌రించారు. రాబోయే ప‌దేళ్ల కోసం 29 వేల కోట్లు కేటాయించారు. కొత్తగా 100 ఎయిర్‌డ్రోమ్‌లు, 200 హెలిప్యాడ్‌లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 
 
ఇంకా జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కూడా ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. 13వేల కోట్లు ఆ ప్రాజెక్టు కోసం ఖ‌ర్చు చేయ‌నున్నారు. కొన్ని రైల్వే ప్రాజెక్టుల‌కు కూడా ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనింగ్ సామర్థ్యం కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ప్రధాని తెలిపారు. ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తోందని చెప్పారు. స్వాభిమానం నిలవాలంటే వ్యక్తి అయినా, దేశమైనా స్వావలంబన సాధించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.