అయోధ్యలో విరాళాల చోరీపై మోహన్ భగవత్ `రామ్-రామ్’

అయోధ్యలో విరాళాల చోరీపై మోహన్ భగవత్ `రామ్-రామ్’
 
అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాల దుర్వినియోగంపై వివాదం నడుస్తున్న తరుణంలో, శ్రీరామునిపై భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ శనివారం క్లుప్తంగా కానీ సూటిగా స్పందించారు. 

భక్తుల విశ్వాసాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలపై స్పందన కోరగా, నాగ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడిన భగవత్ కేవలం “రామ్-రామ్” అని మాత్రమే బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు రామ భక్తులు, సమాజం విశ్వాసాన్ని “తీవ్రంగా గాయపరిచాయని” సర్ కార్యవాహ  దత్తాత్రేయ హోసబలే పేర్కొన్న మరుసటి రోజే భగవత్ ఈ వ్యాఖ్య చేశారు.  దోషులుగా తేలిన వారికి కఠిన శిక్ష విధించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

“ఈ దురదృష్టకర సంఘటన”ను ఆసరాగా చేసుకుని “హిందూ వ్యతిరేక,  దేశ వ్యతిరేక శక్తులు” హిందూ ధర్మాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలు సంయమనం పాటించాలని, తప్పుదోవ పట్టవద్దని ఆయన కోరారు. అయితే, ఆ “హిందూ వ్యతిరేక”, “దేశ వ్యతిరేక” శక్తులు ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
 
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తుండగానే, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కేసులో తమ సమాంతర క్రిమినల్ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, అరెస్టయిన నిందితుడు అవినాష్ శుక్లాను సాక్ష్యాల సేకరణ, ఘటనల పునర్నిర్మాణం, కొత్త ఆధారాల ధృవీకరణ కోసం 24 గంటల పాటు పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. 
 
అతన్ని రిజర్వ్ పోలీస్ లైన్స్‌కు తరలించి దాదాపు రెండు గంటల పాటు విచారించింది. ఆ తర్వాత, అతను వెల్లడించిన వివరాలను ధృవీకరించేందుకు దర్యాప్తు అధికారులు అతన్ని అయోధ్యలోని పలు ప్రాంతాలకు, ఆపై అతని స్వస్థలమైన ప్రతాప్‌గఢ్ జిల్లాకు తీసుకెళ్లారు. నిందితుడికి సంబంధించిన అనేక ఆస్తులను అధికారులు గుర్తించారు. దొంగిలించిన విరాళాల డబ్బుతోనే ఈ ఆస్తులను కొనుగోలు చేశారా? అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. 
 
అత్యధిక సంఖ్యలో ఆస్తులు నిందితుడు అనుకల్ప్ మిశ్రా, అతని బావమరిది లవకుశ్ మిశ్రాలకు సంబంధించినవని అధికారులు గుర్తించారు. వీరిద్దరికీ సంబంధించి ఇప్పటివరకు కనీసం 12 ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. ఈ ఆస్తుల విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని అంచనా. వీటిలో ఏవి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులు, ఏవి ఇటీవల కొనుగోలు చేసినవి అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయోధ్యలోనే కాకుండా బసావా, మిల్కీపూర్, రుదౌలీ వంటి సమీప ప్రాంతాల్లో కూడా నిందితులకు ఆస్తులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.