బెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య రాజీనామా

బెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి  అత్యంత సన్నిహితురాలు, పశ్చిమ బెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలు చంద్రిమ భట్టాచార్య టీఎంసీకి రాజీనామా చేశారు. పార్టీకి చెందిన అన్ని పదవులకు శనివారం రాజీనామా చేశారు. ఇకపై పార్టీకి పూర్తి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు.  

టీఎంసీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు, కాలిఘాట్‌లో మమతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రిమ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. టీఎంసీకి చెందిన వివిధ బ్యాంకు అకౌంట్లకు సంబంధించి బాధ్యతల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు, అలాగే, తన సంతకాన్ని కూడా వాటి నుంచి తొలగిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 

ఇకపై, పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఆమె సంతకం చెల్లదు. పార్టీకి సంబంధించిన అంశాల్లో తన పేరును ప్రస్తావించకూడదని, మమత తరఫున తనను సంప్రదించకూడదని కూడా చంద్రిమ ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే, తన రాజీనామాకు గల కారణాన్ని చంద్రిమ వెల్లడించలేదు.  మమతా బెనర్జీ గత నెలలో చంద్రమా భట్టాచార్యను టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు.  

తాము “అసలైన టీఎంసీ”కి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెబుతూ, తిరుగుబాటు టీఎంసీ వర్గం ఈస్టర్న్ మెట్రోపాలిటన్ బైపాస్ సమీపంలోని పార్టీకి చెందిన బహుళ అంతస్తుల అద్దె కార్యాలయాన్ని ఆక్రమించిన ఒక రోజు తర్వాత ఆమె రాజీనామా చేశారు.  ఆ సమయంలో భట్టాచార్య టీఎంసీ భవన్‌లోనే ఉన్నారని, కొన్ని నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని ఈ విషయంతో పరిచయం ఉన్న వ్యక్తులు తెలిపారు.

“నాకు ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు లేవు. నేను నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాననే అసంతృప్తి నాకే ఉంది. నేను టీఎంసీ భవన్‌ను అప్పగించానని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నాకు చెప్పారు. నేను బాధపడ్డాను. భవన్‌ను అప్పగించడానికి నేను ఎవరు?” అని భట్టాచార్య ప్రశ్నించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఆమె ఆర్థిక, ఆరోగ్య, పంచాయతీ & గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల బాధ్యతలు ఆమె నిర్వహించారు.

 “ఆమె టీఎంసీలో సీనియర్ నాయకురాలు, అదే సమయంలో మమతా బెనర్జీ ప్రభుత్వంలో దీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ఆమె ప్రభుత్వంలో అనేక కీలక శాఖలను నిర్వహించారు. ఆ సమయంలో ఆమె బాధపడకపోవడం దురదృష్టకరం,” అని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు.