దేశభక్తి, భావజాల జర్నలిజానికి ప్రసిద్ధి చెందిన ‘పాంచజన్య’ వారపత్రిక, భారతరత్న, మాజీ ప్రధాని, అటల్ బిహారీ వాజ్‌పేయి మహోన్నత వ్యక్తిత్వం, కృషిపై దృష్టి సారించిన ‘అమిత్ అటల్: ది అన్‌ఫర్‌గెటబుల్ అటల్’ అనే ప్రత్యేక డాక్యుమెంటరీని ఝండేవలన్‌లోని ‘విచార్ వినిమారి న్యాస్ ఆడిటోరియం’లో ప్రదర్శించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే, ప్రఖ్యాత మేధావి, సీనియర్ రాజకీయ నాయకుడు డాక్టర్ మురళీ మనోహర్ జోషి ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ, “ఈ డాక్యుమెంటరీ అత్యంత సందర్భోచితంగా, హృదయస్పర్శగా ఉంది. దీనిని చూస్తుంటే అటల్ జీకి సంబంధించిన ఎన్నో చారిత్రక సంఘటనలు, జ్ఞాపకాలు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి” అని కొనియాడారు.
అటల్ జీ తొలిరోజులను గుర్తుచేసుకుంటూ, ఆయన ఇలా అన్నారు: “పూజ్యుడైన భౌరావ్ దేవరస్ స్ఫూర్తితో, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ మార్గదర్శకత్వంలో, కేవలం 27 ఏళ్ల వయసులోనే అటల్ జీకి ‘పాంచజన్య’ పత్రికకు తొలి సంపాదకుడిగా బాధ్యతలు అప్పగించారు. ఆయన తన రచనలు, కవిత్వం, శక్తివంతమైన ప్రసంగాల ద్వారా దేశంపై చెరగని ముద్ర వేశారు. ఆయన ప్రసిద్ధ కవిత, ‘హిందూ శరీరం, మనస్సు, హిందూ జీవితం, ప్రతి నరంలో హిందూ – నా పరిచయం,’ తొలిసారిగా ‘పాంచజన్య’లో ప్రచురితమైంది.”
జమ్మూ కాశ్మీర్ విషయంలో అటల్ జీ దృఢ సంకల్పాన్ని గుర్తుచేసుకుంటూ, “పంచజన్య తొలి సంపాదకీయం శీర్షిక ‘జమ్మూ కాశ్మీర్‌తో రాజీకి మేము అనుమతించము’ అని, అటల్ జీ తన చివరి శ్వాస వరకు ఈ సంకల్పంలో స్థిరంగా నిలిచారు” అని పేర్కొన్నారు. అటల్ జీ పాత్రికేయ వృత్తిని ఒక ప్రతిజ్ఞగా, ఒక తపస్సుగా భావించారని, ఆయన దినపత్రికలను ‘సమాచార’ మాధ్యమంగా, వారపత్రికలను ‘ప్రచార’ మాధ్యమంగా, మాసపత్రికలను ‘ఆలోచన’ మాధ్యమంగా అభివర్ణించారని తెలిపారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న పాంచజన్య ప్రస్తుత రూపాన్ని ఆయన ప్రశంసిస్తూ ఈ ప్రయత్నం, భారతదేశపు నిజమైన సేవకుడి, గొప్ప జాతీయ నాయకుడి జీవితాన్ని కొత్త తరానికి పరిచయం చేస్తుందని చెప్పారు.
అటల్ జీకి దీర్ఘకాల సహచరుడైన డా. మురళీ మనోహర్ జోషి, 1948 నుండి అటల్ జీ, పండిట్ దీన్‌దయాల్ జీలతో గడిపిన తన జ్ఞాపకాలను పంచుకున్నారు. జనతా పార్టీ ప్రభుత్వ కాలాన్ని గుర్తుచేసుకుంటూ, అన్ని రాజకీయ గందరగోళాల మధ్య దేశ హద్దులను దాటిన ఏకైక నాయకుడు అటల్ జీ మాత్రమేనని ఆయన తెలిపారు. చైనాకు వెళ్లి, దాని తప్పుడు విధానాలను ధైర్యంగా వ్యతిరేకించిన మొదటి భారతీయ నాయకుడు ఆయనే అని స్పష్టం చేశారు.
సంఘ్‌తో సంబంధాలు తెంచుకోవాలని కొందరు రాజకీయ శక్తులు ఒత్తిడి చేసినప్పుడు, అటల్ జీ సూటిగా ఇలా అన్నారు, “మన బొడ్డుతాడు సంఘ్‌తో ముడిపడి ఉంది, మనం సంఘ్ నుండి ఎలా విడిపోగలం?” అని గుర్తు చేశారు. తన ఆలోచనలతో రాజీ పడమని బలవంతం చేసే ఏ ప్రభుత్వాన్నీ తాను ముట్టుకోబోనని ఆయన పార్లమెంటులో స్పష్టం చేశారని డా. జోషి తెలిపారు.
తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి ఒక సంఘటనను పంచుకుంటూ, పాఠశాలల్లో ‘సరస్వతీ వందనం’పై వివాదం సృష్టించేందుకు ప్రయత్నం జరిగినప్పుడు, అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, “మా ప్రభుత్వంలో సరస్వతీ వందనం జరగకపోతే, మరెప్పుడు ఏ ప్రభుత్వంలో జరుగుతుంది? అది తప్పక జరగాలి” అని స్పష్టమైన, దృఢమైన వైఖరి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా, అంతరించిపోయిన సరస్వతీ నది పునరుద్ధరణకు, పరిశోధన పనులకు ఆయన కట్టుబడి ఉన్నారని చెప్పారు. దృఢ సంకల్పంతో, ఆలోచనతో అందరినీ కలుపుకొని ముందుకు సాగే కార్యదీక్ష ఈ రోజు దేశానికి అత్యవసరం అని డా. జోషి సూచించారు.
పాంచజన్య సంపాదకుడు హితేష్ శంకర్‌తో పాటు ఇతర మేధావులు, రచయితలు, పాత్రికేయులు కూడా పాల్గొన్నారు. డాక్యుమెంటరీ “అమిత్ అటల్”, శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఒక వాలంటీర్‌గా, ఉద్యమకారుడిగా, శక్తివంతమైన కవిగా, చురుకైన పాత్రికేయుడిగా, దార్శనిక సంపాదకుడిగా, చివరకు దేశ ప్రధానమంత్రిగా ఎదిగిన ప్రస్థానంలోని అంతగా వెలుగులోకి రాని కోణాలను యథార్థంగా ఆవిష్కరిస్తుంది.

More Stories
బీజేపీలో చేరిన ముగ్గురు సమాజ్‌వాదీ ఎమ్యెల్యేలు!
ఏఐ రూపొందించిన ప్రశ్నలు, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు!
స్టార్‌లింక్‌తో జాతీయ భద్రతకు ముప్పు..నిషేధించండి